తిరిగొచ్చిన రాకెట్!
* విజయవంతంగా ల్యాండ్ అయిన ‘ఫాల్కన్ 9’
* అంతరిక్ష పరిశోధన చరిత్రలో ఓ ప్రైవేటు కంపెనీ అద్భుతం
* 11 శాటిలైట్స్‌ను కక్ష్యలోకి ప్రవేశపెట్టి తిరుగుబాట
మియామీ(యూఎస్): రాకెట్లు ఉపగ్రహాలను రోదసిలో ప్రవేశపెడతాయి.. కానీ అవి తిరిగి రావని ఇప్పటి వరకుతెలుసు. అయితే ఇక విమానాల్లాగే రాకెట్లూ మళ్లీ తిరిగొస్తాయి.. వాటిని మళ్లీ వాడుకోవచ్చు కూడా. అంతరిక్ష పరిశోధన చరిత్రలోనే తొలిసారిగా నింగిలోకి దూసుకెళ్లిన ‘ఫాల్కన్ 9’ అనే రాకెట్ విజయవంతంగా భూమిపైకి వచ్చింది.
కాలిఫోర్నియాకు చెందిన స్పేస్ ఎక్ప్‌ప్లొరేషన్ టెక్నాలజీస్ కంపెనీ(స్పేస్-ఎక్స్)అనే ప్రైవేట్ సంస్థ దీన్ని రూపొందించింది. ఎన్నో విఫల యత్నాల తర్వాత భూమిపై ఫాల్కన్ నేరుగా ల్యాండ్ అయినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. రాకెట్ మొదటి దశ ఫ్లోరిడాలోని కేప్‌కెనవరల్ వద్ద సోమవారం నేలపై దిగినట్లు పేర్కొన్నారు. ఆర్బ్‌కాం కంపెనీకి చెందిన 11 కృత్రిమ ఉపగ్రహాలను ఫాల్కన్ భూ సమీప కక్ష్యలో ప్రవేశపెట్టిందన్నారు. ‘నింగిలోకి దూసుకెళ్లిన 10 నిమిషాల్లోనే రాకెట్ మొదటి దశ నేలపై ల్యాండ్ అయింది’ అని స్పేస్-ఎక్స్ పేర్కొంది.
స్పేస్-ఎక్స్‌ను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అభినందించింది. కృత్రిమ ఉపగ్రహాలను (పేలోడ్) అంతరిక్షంలోకి ప్రవేశపెట్టిన ప్రతిసారి కొన్ని వేల కోట్ల రూపాయలు వృథా అవుతున్నాయి. ఎంతో విలువైన రాకెట్ సామగ్రి కూడా నాశనం అవుతోంది. ఇప్పుడు స్పేస్-ఎక్స్ చేపట్టిన ప్రయోగంతో రాకెట్ ప్రయోగాల్లో విప్లవాత్మక మార్పులు రానున్నాయి.
అమెజాన్ కంపెనీకి చెందిన బ్లూ ఆరిజిన్ అనే రాకెట్ల తయారీ కంపెనీ ఈ ఏడాది నవంబర్‌లో ఈ తరహా ప్రయోగం విజయవంతంగా చేపట్టింది. అయితే ఈ ప్రయోగంలో నేరుగా భూమిపై ల్యాండ్ కాకుండా పారాచూట్ సహయంతో నేలపైకి వచ్చింది.