
ప్రత్యేక హోదాయే ప్రాణవాయువు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పురోభివృద్ధికి ఎంతో కీలకమైన ప్రత్యేక హోదా సాధన కోసం రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది గర్జించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. రాష్ట్రం ప్రగతి పథంలో పయనించాలంటే ప్రత్యేక హోదా ఒక్కటే మార్గమని, అదే రాష్ట్రానికి ప్రాణవాయువు అని స్పష్టం చేసింది. తెలుగువాడి గర్జన ఢిల్లీ వరకు వినిపించాలని పేర్కొంది. ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే అనేక రూపాల్లో పోరాటం కొనసాగిస్తున్నారు.
ఇందులో భాగంగా ఈ నెల 26 నుంచి గుంటూరులో నిరవధిక నిరాహార దీక్ష చేపడుతున్న నేపథ్యంలో ప్రత్యేక హోదా వల్ల రాష్ట్రానికి చేకూరే ప్రయోజనాలను సోదాహరణంగా వివరిస్తూ వైఎస్సార్‌సీపీ మంగళవారం ఒక కరపత్రాన్ని విడుదల చేసింది. హోదా వల్ల రాష్ట్రంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని కరపత్రంలో వెల్లడించిం ది. ప్యాకేజీ పేరుతో ప్రజలను మభ్యపెడుతున్న తీరును ఎండగట్టింది.
హోదా సంజీవని కాదని, సర్వరోగ నివారిణి జిందా తిలిస్మాత్ కానేకాదంటూ అధికారంలో ఉన్న నేతల అడ్డగోలు ప్రకటనలు రాష్ట్ర ప్రయోజనాలను కాలరాయడమేనని విమర్శించింది. ఇలాంటి దుస్సాహసానికి ఒడిగడుతున్న పార్టీలు, నాయకులు, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉద్యమించాల్సిన సమయమిదేనని వివరించింది. ప్రత్యేక హోదా ఏపీ హక్కు, దానిని ఇవ్వడం ప్రభుత్వాల బాధ్యత అని గుర్తుచేసింది. ప్రత్యేక హోదాయే సంజీవని, శ్రీరామరక్ష అని స్పష్టం చేసింది. నిరాశ నిస్పృహల్లో ఉన్న యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడానికి పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
హోదాతో ఎన్నో రకాల రాయితీలు లభించి, రాష్ట్రం పారిశ్రామికంగా ముందుకు వెళుతుందని తెలిపింది. ప్రత్యేక హోదా సాధన కోసం ఈ నెల 26 నుంచి వైఎస్ జగన్ చేపడుతున్న నిరవధిక నిరాహార దీక్షకు బాసటగా నిలవాలని వైఎస్సార్‌సీపీ పిలుపునిచ్చింది. ప్రభుత్వ తప్పుడు ప్రచారం వల్ల ఇప్పటికే ఐదుగురు ఆత్మ బలిదానాలు చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. పోరాడి హోదా సాధించుకోవాలని పేర్కొంది. ప్రత్యేక హోదా ఇవ్వకుండా కాలయాపన చేయడమే కాకుండా దాన్ని నీరుగార్చే ప్రయత్నాలకు నిరసనగా ఆంధ్రులు చేసే గర్జన ఢిల్లీలో ప్రతిధ్వనించాలని కరపత్రంలో పిలుపునిచ్చింది.
హోదా కోసం గర్జించు
ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కు అని వైఎస్సార్‌సీపీ ఉద్ఘాటించింది. హోదా విషయంలో మోసం చేస్తున్న ప్రభుత్వాలపై పోరాడేందుకు అందరూ కలిసికట్టుగా ముం దుకు రావాలని కరపత్రంలో కోరింది. ‘‘రాష్ట్రాన్ని విభజించడమే అన్యాయం. ఆ అన్యాయం చేస్తున్న సమయంలో సాక్షాత్తూ పార్లమెంట్‌లో అప్పటి ప్రధాని ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు.
ఐదేళ్లు చాలదు పదేళ్లు కావాలని బీజేపీ అప్పుడు డిమాండ్ చేసింది. తాము అధికారంలోకి వస్తే పదేళ్లు ఇస్తామని బీజేపీ ఏపీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. సీఎం చంద్రబాబు కూడా ప్రత్యేక హోదా పదేళ్లు కావాలని ఎన్నికలకు ముందు, ఆ తర్వాత చెప్పారు. అధికార, ప్రతిపక్ష పార్టీలు కలిసి రాష్ట్రాన్ని విభజించేముందు పార్లమెంట్‌లో ఇచ్చిన హామీకే దిక్కులేకపోతే ఇక ఆ చట్టసభకు విశ్వసనీయత ఏముం టుంది?’’ అని కరపత్రంలో సూటిగా ప్రశ్నించింది.
‘‘చంద్రబాబు ఏపీకి ప్రత్యేక హోదా కంటే తన ముఖ్యమంత్రి హోదా ఊడకుండా చూసుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఐదు కోట్ల మంది ప్రజలు, వారి పిల్లల భవిష్యత్తును, ముందు తరాల ప్రయోజనాలను తాకట్టు పెడుతూ ఢిల్లీకి వెళ్లి మరీ ప్రత్యేక హోదా సంజీవని కాదంటూ దుర్మార్గమైన ప్రకటన చేశారు’’ అని నిప్పులు చెరిగింది. ‘‘గర్జించు ఆంధ్రప్రదేశ్.. ప్రత్యేక హోదా కోసం గర్జించు’’ పేరుతో రూపొందించిన ఈ కరపత్రంలో ప్రత్యేక హోదా వల్ల దక్కే ప్రయోజనాలను తెలియజేశారు. ఈ కరపత్రాన్ని ప్రజల సౌలభ్యం కోసం వైఎస్సార్‌సీపీ తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.