సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీ మేరకు ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం రాష్ట్రవ్యాప్త బంద్ జరుగుతోంది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా ఆనాడు రాజ్యసభలో మన్మోహన్‌సింగ్, వెంకయ్యనాయుడు, అరుణ్‌జెట్లీ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌తో పలు ప్రజా సంఘాలు, సీపీఐ రాష్ట్ర బంద్‌కు పిలుపిచ్చాయి. దీనికి అధికారపక్షం మినహా ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్‌సీపీతోపాటు వివిధ రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి.
ప్రైవేటు విద్యాసంస్థలు స్వచ్ఛం దంగా సెలవు ప్రకటించాయి. వాణిజ్య, వ్యాపార సంస్థల్ని మూసి వేస్తామని ఆయా వర్గాల సంఘాలు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోయినా ఆచితూచి వ్యవహరిస్తోంది. మొదటి రెండు గంటల్లో బంద్ ప్రభావాన్ని అంచనా వేసి బస్సుల్ని తిప్పాలా వద్దా? అనేది నిర్ణయిస్తామని ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. బంద్‌కు సహకరించాలని కాంగ్రెస్ పార్టీ, పది వామపక్ష పార్టీలు, ఆంధ్రా మేథావుల ఫోరం, దళిత, బహుజన, విద్యార్థి, యువజన సంఘాలు ప్రజలకు విజ్ఞప్తి చేశాయి. బంద్‌ను జయప్రదం చేసి ప్రత్యేక హోదా కోసం ప్రాణత్యాగం చేసిన మునికోటికి నివాళులర్పించాలని కాంగ్రెస్ కోరగా, ప్రత్యేక హోదా సాధనలో ఇది తొలిమెట్టు మాత్రమేనని సీపీఐ, సీపీఎం ప్రకటించాయి.
జగన్ మద్దతు తెలిపారు : రామకృష్ణ
ప్రత్యేక హోదా సాధనకై దేశ రాజధాని ఢిల్లీలో ధర్నా చేసిన ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర బంద్‌కు పూర్తి మద్దతు ప్రకటించారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తెలిపారు. ధర్నాలో ఉన్నప్పుడే జగన్ తనకు ఫోన్ చేసి ప్రజల ఆకాంక్ష మేరకు జరిగే ఏ ఉద్యమానికై నా తమ మద్దతు ఉంటుందని చెప్పారన్నారు.
రేషన్ డీలర్ల సంఘం మద్దతు
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం మంగళవారం చేపట్టిన రాష్ట్ర బంద్‌కు మద్దతుగా నేడు రేషన్ షాపులు మూసివేస్తున్నట్లు రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బుగతా వెంకటేశ్వరరావు, దివి లీలామాధవరావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.