
భార్యను చంపి.. బ్యాగులో కుక్కి!
* వికారాబాద్ అడవుల్లో దహనం.. పూడ్చివేత
* కానిస్టేబుల్ రామకృష్ణ ఘాతుకం
హైదరాబాద్/వికారాబాద్ రూరల్/జక్రాన్‌పల్లి: పెళ్లై ఏడాది తిరగక ముందే ఓ కానిస్టేబుల్.. భార్యను కిరాతకంగా హత్య చేశాడు! ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు వికారాబాద్ అడవుల్లోకి తీసుకెళ్లి దహనం చేశాడు. ఆనవాళ్లను పూడ్చిపెట్టాడు. ఆ తర్వాత తన భార్య కనిపించడం లేదంటూ అమాయకంగా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసి చావు తెలివిని ప్రదర్శించాడు. అయితే పోలీసుల విచారణలో కళ్లు తిరిగే నిజాలు బయటపడ్డాయి.
వేరొకరితో వెళ్లిపోయిందంటూ అత్తారింటికి..
నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం కొత్తపల్లికి చెందిన ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ కడియాల రామకృష్ణ కిందటేడాది ఆగస్టు 20న దూరపు బంధువైన సుప్రియ (19)ను వివాహం చేసుకున్నాడు. వరకట్నంగా రూ.10 లక్షల నగదు, పది తులాల బంగారం, రూ.1.20 లక్షల విలువైన బైక్ ఇచ్చారు. రామకృష్ణ హైదరాబాద్‌లోని రిజర్వ్ బ్యాంకులో ఎస్పీఎఫ్ గార్డుగా విధులు నిర్వర్తిస్తూ హిమాయత్‌నగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాడు. భార్యపై అనుమానంతో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి.
ఈ క్రమంలో గతనెల 6న టవల్‌తో సుప్రియ మెడకు ఉరేసి హత్య చేశాడు. ఎవరికీ అనుమానం రాకుండా స్వగ్రామానికి చెందిన తన స్నేహితుడు ప్రదీప్ సాయంతో స్కూటర్‌పై స్పోర్ట్స్ బ్యాగ్‌లో వికారాబాద్ అడవుల్లోకి తీసుకెళ్లారు. మొదట పెట్రోల్ పోసి దహనం చేసి, ఆ తర్వాత ఆనవాళ్లు కూడా కనబడకుండా పూడ్చిపెట్టి, ఇంటికి తిరిగి వచ్చారు. అదే రోజు రాత్రి తన అత్తగారింటికి(నిజామాబాద్ జిల్లా మునిపల్లి) వెళ్లాడు. సుప్రియ తనకు మెసేజ్ పెట్టి వెళ్లిపోయిందని, సుప్రియ కనిపించడం లేదని, వేరొకరితో వెళ్లిపోయిందని నమ్మబలికాడు.
ఆగస్టు 14న తన భార్య కనిపించడం లేదంటూ అత్తామామలతో కలిసి నారాయణగూడ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అప్పట్నుంచి మునిపల్లిలోనే ఉంటూ ఎవరికి అనుమానం రాకుండా బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెతికాడు. సుప్రియను వెతకడానికి అత్తామామల నుంచి రూ.లక్ష తీసుకున్నాడు. అరుుతే సుప్రియను వెతక్కుండా తన స్నేహితులతో కలిసి తిరుగుతున్నట్లు గమనించిన సుప్రియ తల్లిదండ్రులు.. రామకృష్ణపై అనుమానం వ్యక్తం చేశారు.
దీంతో పోలీసులు అదుపులోకి తీసుకొని రామకృష్ణను తమదైన శైలిలో విచారణ జరిపారు. సుప్రియను తానే హత్య చేసి వికారాబాద్ అడవుల్లో దహనం చేసి పూడ్చి పెట్టినట్లు అతడు అంగీకరించాడు. దీంతో రామకృష్ణను గురువారం అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్న నారాయణగూడ సీఐ భీంరెడ్డి సిబ్బందితో కలిసి నిందితుడిని తీసుకొని వికారాబాద్ వద్ద అనంతగిరి అడవికి చేరుకున్నారు. అక్కడ పూడ్చిపెట్టిన మృతదేహాన్ని వెలికితీసి ఫోరెన్సిక్ నిపుణులతో పోస్టుమార్టం చేయించారు. అనంతరం మృతదేహాన్ని మునిపల్లికి తీసుకువెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. రామకృష్ణ గత మార్చి 24 నుంచి విధులు నిర్వహించడం లేదని పోలీసులు తెలిపారు.
అందుకే చంపేశాడు
సుప్రియ తండ్రి
రామకృష్ణ నపుంసకుడని సుప్రియ తండ్రి సత్యనారాయణ ఆరోపించారు. ఈ విషయం ఎక్కడ బయటపడి పరువు పోతుందోనని తన కూతురిని చంపేశాడని చెప్పారు.