![శ్రీదేవిపై సూపర్ స్టార్ అనూహ్య ప్రశంసలు!](/styles/webp/s3/article_images/2017/09/5/41489552773_625x300.jpg.webp?itok=WOqVxBn5)
శ్రీదేవిపై సూపర్ స్టార్ అనూహ్య ప్రశంసలు!
ఇటీవల ముంబైలో జరిగిన ఓ అవార్డుల ప్రదానోత్సవంలో శ్రీదేవిని స్టేజ్ మీదకు ఆహ్వానిస్తూ.. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ అనూహ్యరీతిలో ప్రశంసల వర్షం కురిపించారు. ఈ వేడుకలోనే శ్రీదేవి తాజా చిత్రం 'మామ్' ఫస్ట్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆహుతులను విస్మయపరుస్తూ మైక్ అందుకున్న సల్మాన్.. తనతోపాటు, ఆమిర్, షారుఖ్, అక్షయ్‌ల కన్నా శ్రీదేవి అతిపెద్ద సూపర్ స్టార్ అని కొనియాడారు.
కార్యక్రమ హోస్ట్ మనీష్ పాల్ శ్రీదేవిని ఆహ్వానిస్తూ.. 'స్టార్ ఆఫ్ ద మిలినీయం'గా అభివర్ణించారు. దీంతో అప్పుడు స్టేజ్ మీద ఉన్న సల్మాన్ మైక్ అందుకొని.. 'ఆమిర్ ఖాన్, షారుఖ్ ఖాన్, అక్షయ్‌కుమార్, నేను ఎనో చిత్రాలు చేశాం. ఆమిర్ చేసిన చిత్రాలు ఇప్పటికీ 50 దాటలేదు. ఆమిర్ చాలా సమయం తీసుకుంటాడు. ఏడాదికి ఒక చిత్రం మాత్రమే చేస్తాడు. షారుఖ్ 100 చిత్రాల వరకు చేసి ఉండొచ్చు. మేమందరం కలిసి 250-275 చిత్రాలు మాత్రమే చేశాం. కానీ, ఒక లెజెండ్ నటి ఉన్నారు. ఆమె ఎంతో ప్రతిభావంతురాలు. వృత్తిపట్ల చిత్తశుద్ధి, అకుంఠిత దీక్ష గల వ్యక్తి. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె 300లకుపైగా చిత్రాలు చేశారు. మేం ఎవరం ఆమెకు సాటిరాం. ఆమెనే శ్రీదేవి' అంటూ అద్భుతమైన స్వాగతాన్ని పలికాడు.
బాలీవుడ్‌లో ఓ బడా సూపర్ స్టార్ ఇలా ప్రశంసలు గుప్పించడం చాలా అరుదు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ ఇలా పలు భాషల్లో అనేక చిత్రాల్లో శ్రీదేవి నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. తాజాగా బోనీ కపూర్ తెరకెక్కించిన 'మామ్' సినిమాలో సవతి కూతురికి జరిగిన అన్యాయంపై పోరాడే ఓ ధీరోదాత్తమైన తల్లిగా శ్రీదేవి కనిపించనున్నట్టు తెలుస్తోంది.