
సాగు సంబంధమైనవి 342
సాక్షి, హైదరాబాద్: రైతు ఆత్మహత్యలపై రాష్ట్ర ప్రభుత్వం లెక్క తేల్చింది. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఈ ఏడాది అక్టోబర్ 8వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా 782 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపింది. వారిలో కేవలం 342 మంది ఆత్మహత్యలు నిజమైనవని, మిగిలినవి వ్యవసాయ సంబంధమైనవి కావని స్పష్టం చేసింది. నవంబర్, డిసెంబర్‌లో ఇప్పటివరకు జరిగిన ఆత్మహత్యల వివరాలు ఇంకా రాలేదని అధికారులు తెలిపారు. ఆత్మహత్యల సంఖ్యను ప్రభుత్వం తక్కువ చేసి చూపెడుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇప్పటివరకు దాదాపు 1500 మందికిపైగా ఆత్మహత్యలు చేసుకున్నారని రైతు సంఘాలు చెబుతున్నాయి. ఆత్మహత్యలను నిర్దారించేందుకు జిల్లాల్లో డివిజన్ స్థాయిలో ఆర్డీవో చైర్మన్‌గా, డీఎస్పీ, వ్యవసాయశాఖ ఏడీలు సభ్యులుగా వేసిన కమిటీలు వీలైనంత మేరకు ఆత్మహత్యల సంఖ్యను తక్కువ చేసి చూపెడుతోందని రైతు సంఘాలు విమర్శిస్తున్నాయి.
ఆత్మహత్య చేసుకున్న రైతుకు సంబంధించిన దాదాపు 16 రకాల రికార్డులను కమిటీ పరిశీలించి కొర్రీలు పెట్టి నిర్దారించింది. జాతీయ క్రైం రికార్డు బ్యూరో ప్రకారం తెలంగాణలో రైతులు ఆర్థికంగా దివాళా తీయడం, అప్పులు పెరగడం, పంట న ష్టం జరగడం, వ్యవసాయ సంబంధిత సమస్యల కారణంగా చనిపోతున్నారని అంచనా వేసింది.
పెళ్లి సంబంధిత సమస్యలు, వ్యవసాయ సమస్యలు, అప్పులు, దివాళా కారణంగా మహిళా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని కూడా పేర్కొంది. ఆత్మహత్యలు చేసుకునే రైతుల్లో 41.8 శాతం మంది సన్నకారు రైతులు, 25.2 శాతం మధ్యతరహా రైతులు, 22.5 శాతం మంది చిన్నకారు రైతులు, 2.3 శాతం మంది పెద్ద రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపింది. కానీ వీటిని తెలంగాణ సర్కారు లెక్కలోకి తీసుకోవడంలేదు.