
వారిని పోటీ నుంచి తప్పించం: ఆమ్ ఆద్మీ పార్టీ
అక్రమ మార్గాల్లో డబ్బు వసూళ్లకు పాల్పడుతూ ‘స్టింగ్ ఆపరేషన్ ’లో చిక్కినట్లు పేర్కొంటున్న తమ అభ్యర్థులను ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పించేది లేదని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ: అక్రమ మార్గాల్లో డబ్బు వసూళ్లకు పాల్పడుతూ ‘స్టింగ్ ఆపరేషన్ ’లో చిక్కినట్లు పేర్కొంటున్న తమ అభ్యర్థులను ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పించేది లేదని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) స్పష్టం చేసింది. అసలు సీడీని ట్యాంపర్ చేశారని, స్టింగ్ ఆపరేషన్ నిర్వహించిన ‘మీడియా సర్కార్’ వెబ్‌సైట్ అసలు సీడీ ఇచ్చేందుకు నిరాకరించిందని ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఆరోపణలున్న తమ అభ్యర్థులపై చర్యలు తీసుకోవడం సహ జ న్యాయసూత్రాలకు విరుద్ధమని పేర్కొంది.
మీడియా సర్కార్‌పై పరువునష్టం దావా వేస్తామని తెలిపింది. ఈమేరకు పార్టీ నేతలు అరవింద్ కేజ్రీవాల్, యోగేంద్ర యాదవ్‌లు శుక్రవారమిక్కడ వెల్లడించారు. వీరు ఆరోపణలు ఎదుర్కొంటున్న అభ్యర్థులతో కలిసి విలేకర్లతో మాట్లాడారు. సీడీ వ్యవహారంపై విచారణకు అంతర్గత కమిటీని నియమిం చామని, అసలు సీడీని శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల్లోపు తమకివ్వాలని వెబ్‌సైట్‌ను కోరామని, అయితే ఆ వెబ్‌సైట్ నిరాకరించిందని తెలిపారు. ఎన్నికల సంఘం(ఈసీ) అసలు సీడీని క్షుణ్ణంగా పరిశీలించాలని, తమ అభ్యర్థులు తప్పు చేసినట్లు తేలితే పోటీ నుంచి తప్పుకుంటారని చెప్పారు. ఢిల్లీ ఎన్నికల్లో ‘ఆప్’ తరఫున పోటీ చేస్తున్న షాజియా ఇమ్లీ, కుమార్ విశ్వాస్ సహా తొమ్మిది మంది పార్టీ నేతలు అక్రమ మార్గాల్లో డబ్బు వసూళ్లకు పాల్పడుతూ తమ స్టింగ్ ఆపరేషన్‌కు చిక్కారని ‘మీడియా సర్కార్’ గురువారం వెల్లడించం తెలిసిందే.