దలైలామాపై భగ్గుమన్న చైనా.. భారత్‌కు అల్టిమేటం!
బీజింగ్: అరుణాచల్ ప్రదేశ్‌లో కొనసాగుతున్న బౌద్ధ మత గురువు దలైలామా పర్యటనపై చైనా భగ్గుమంది. 'వివాదాస్పద ఆ ప్రాంతం'లో దలైలామా పర్యటనను వెంటనే నిలిపివేయాలని భారత్‌కు అల్టిమేటం జారీచేసింది. అరుణాచల్ ప్రదేశ్‌లో దలైలామా పర్యటనకు అనుమతించడం ద్వారా భారత్ తమతో సంబంధాలను చెడగొట్టుకునే సాహసం చేసిందని మండిపడింది.
81 ఏళ్ల టిబేట్ ఆధ్యాత్మిక నాయకుడు దలైలామా మంగళవారం నుంచి వారం రోజులపాటు అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. దలైలామా పర్యటన భారత్ అంతర్గత విషయమని, ఈ విషయంలో రాద్ధాంతం చేయడం తగదని భారత్ ఇప్పటికే చైనాకు హితవు పలికింది. అయితే, అరుణాచల్ ప్రదేశ్ దక్షిణ టిబేట్‌లో భాగమని మొండిగా వాదిస్తున్న చైనా.. సరిహద్దుల్లో ఆ వివాదాస్పద ప్రాంతానికి దలైలామాను ఎలా అనుమతిస్తారని ప్రశ్నించింది.
'తప్పుడు చర్యలను వెంటనే మానుకోవాలని భారత పక్షాన్ని కోరుతున్నాం. సున్నితమైన విషయాలను రెచ్చగొట్టదు. భారత్-చైనా సంబంధాల వృద్ధికి దోహదపడే సమగ్ర చర్యలు తీసుకోవాలి' అని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి హు చున్యింగ్ బుధవారం మీడియాతో అన్నారు. దలైలామా ఆధ్యాత్మిక కారణాలతోనే ఈ పర్యటన చేస్తున్నారన్న భారత వాదనను సైతం చైనా తోసిపుచ్చింది. వివాదాస్పద ప్రాంతంలో దలైలామా ఆధ్యాత్మిక పర్యటన చేస్తున్నారంటే నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరని వ్యాఖ్యానించింది. '14వ దలైలామా పాత్ర ఏమిటో భారత్‌కు చాలా బాగా తెలుసు. వివాదాస్పద ప్రాంతంలో ఈ పర్యటనకు అనుమతించడమంటే.. టిబేట్ విషయంలో భారత్ చిత్తశుద్ధికి వ్యతిరేకమే అవుతుంది. అంతేకాకుండా సరిహద్దుల్లో వివాదాన్ని రేపుతుంది' అని చున్యింగ్ పేర్కొన్నారు. తమ అభ్యంతరాలను బేఖాతరు చేసి మరీ దలైలామా పర్యటనను అనుమతించినందుకు భారత్‌కు తమ నిరసనను తెలుపుతామని చైనా పేర్కొంది. ఇది ఇరుదేశాల సంబంధాలను దారుణంగా దెబ్బతీయడమే కాకుండా సరిహద్దు వివాదంలో ఉద్రిక్తతలు పెంచవచ్చునంటూ సంకేతాలు ఇచ్చింది.