భారత్‌కు భారీ మూల్యం తప్పదు: డ్రాగన్ బుసలు!
భారత్‌పై డ్రాగన్ మరోసారి బుసలు కొట్టింది. దలైలామాను అరుణాచల్‌ప్రదేశ్‌లో పర్యటించేందుకు అనుమతించడం వల్ల భారత్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదంటూ.. తన కనుసన్నలలో ఉండే ప్రభుత్వ మీడియాతో చైనా హెచ్చరికలు చేయించింది. దలైలామా పర్యటనకు ప్రతిఘటనగానే అరుణాచల్ ప్రదేశ్‌లోని ఆరు ప్రాంతాల పేర్లను మార్చినట్టు సంకేతాలు ఇచ్చింది.
దక్షిణ టిబేట్‌లో భాగమైన అరుణాచల్ ప్రదేశ్ తమదేనని వాదిస్తున్న చైనా తాజాగా ఆ రాష్ట్రంలోని ఆరు ప్రాంతాల పేర్లను మారుస్తున్నట్టు ప్రకటించింది. అయితే, ఈ ప్రకటనను భారత్ తీవ్రంగా ఖండించింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని ప్రతి అంగుళం కూడా తమదేనని స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో చైనా జాతీయవాద పత్రిక గ్లోబల్ టైమ్స్ స్పందిస్తూ.. ‘చైనా ఇప్పుడు దక్షిణ టిబేట్‌లోని పేర్లను ఎందుకు ప్రామాణీకరించిందో భారత్ ఓసారి తీవ్రంగా ఆలోచించుకోవాలి. దలైలామాను వాడుకోవడం భారత్‌కు సరైన చాయిస్ కాదు. ఒకవేళ భారత్ ఇదే గేమ్‌ను కొనసాగించదలుచుకుంటే.. ఆ దేశానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది’ అని వ్యాఖ్యానించింది. భారత్ కంటే చైనా బలమైన దేశమని, ఒకవేళ ఏ దేశం బలంగా ఉందో చూడాలని భావిస్తే.. సరిహద్దు సమస్యలను పరిష్కరించుకోవడానికి చైనా చర్చల జోలికి రానేరాదని తెగేసి చెప్పింది. అంతేకాకుండా చైనా తాజా చర్యలను ప్రతీకార చర్యలుగా అభివర్ణిస్తూ భారత మీడియా కథనాలు రాసిందని, ఇది అసంబద్ధమైనదంటూ పేర్కొంది.