'లెక్చర్ దంచొద్దు'
న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసుపై రాజ్యసభలో వరుసగా రెండో రోజు అధికార విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. తమ పార్టీ నేతలపై బీజేపీ ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపునకు పాల్పడుతోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ సభ్యులు బుధవారం సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు వీరికి మద్దతు తెలపడంతో సభలో గందరగోళం రేగింది.
నేషనల్ హెరాల్డ్ కేసు ఇద్దరు వ్యక్తులకు సంబంధించిందని, దీన్ని కోర్టు చూసుకుంటుందని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు. తమకు లెక్చర్ ఇవ్వడం మానుకోవాలని నఖ్వీకి తృణమూల్ ఎంపీ డెరెక్ ఒబ్రీన్ సూచించారు. ఈ కేసును ఈడీ చీఫ్ మూసేశారని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ తెలిపారు. అయితే ఎన్డీఏ ప్రభుత్వం ఆయనను బదిలీ చేసి కొత్తగా మరొకరిని ఈడీ చీఫ్ గా నియమించి కేసు విచారణను మళ్లీ ప్రారంభించిందని ఆజాద్ ఆరోపించారు. అధికార, ప్రతిపక్ష సభ్యుల వాగ్యుద్ధంతో రాజ్యసభ రేపటికి వాయిదా పడింది.