అశోక్ గజపతి రాజు వార్నింగ్
ముంబై: విమాన టికెట్ రద్దు చేసుకున్న ప్రయాణికులకు పన్ను, సుంకాలను తిరిగి చెల్లించకపోతే కఠిన చర్యలు తప్పవని పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు హెచ్చరించారు. ఎయిర్ ట్రావెల్ నిర్వాహకులు నిబంధనల ప్రకారం ప్రయాణికులకు చెల్లించాల్సినవి ఎందుకు చెల్లించడం లేదని ట్విటర్‌లో ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత కొన్ని రోజులుగా పన్ను, సుంకాలు తిరిగి చెల్లించడంలేదని తనకు ప్రయాణికుల నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్నాయని వెల్లడించారు. ఎయిర్ ట్రావెల్ నిర్వాహకులు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇదే పరిస్థితి కొనసాగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతేడాది నుంచి అమల్లోకి వచ్చిన ‘ప్యాసింజర్ ఫ్రెండ్లీ’ విధానంలో టికెట్ రద్దు చేసుకున్న ప్రయాణికులకు తప్పనిసరిగా పన్ను, సుంకాలు తిరిగి చెల్లించాలి.