నిందితులు ఉపయోగించిన కారు.ప్రధాన నిందితుడు నాసీర్ అహ్మద్
బెంగళూరు: పీజీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం చేసిన నిందితులకు రాజకీయ నాయకులు అండదండలు ఉండటంతో చాకచక్యంగా తప్పించుకున్నారని ఆరోపణలు వినవస్తున్నాయి. ఈ ఘటనపై విద్యార్థుల ఆగ్రహం ఒక్కసారిగా కట్టలుతెంచుకుంది. సామూహిక అత్యాచారం చేసిన వారిని ఎన్‌కౌంటర్ చెయ్యాలని రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థినులు డిమాండ్ చేస్తున్నారు. ఆందోళనలు చేస్తున్నారు. మంగళూరు విశ్వవిద్యాలయంలో పీజీ చదువుతున్న విద్యార్థిని వారం రోజులు సెలవులు రావడంతో బెంగళూరులో ఉన్న కుటుంబ సభ్యుల దగ్గరకు వచ్చిన సమయంలో ఈ దుర్ఘటన జరిగింది.
ఈ కేసులో ప్రధాన నిందితుడు నాసీర్ అహ్మద్ అలియాస్ హైదర్ (24) తండ్రి బహుద్దూర్ బహుజన సమాజ్‌వాది పార్టీ (బీఎస్‌పీ) ప్రముఖ నాయకుడు. కేసు తప్పుదోవపట్టించడానికి పలువురు రాజకీయ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ కేసులో అరెస్టు అయిన ప్రధాన నిందితుడు నాసీర్ అహ్మద్ తెలిపిన వివరాల ప్రకారం సామూహిక అత్యాచారం చేసిన కేజీ హళ్ళి నివాసి వాసీం (25), మహ్మద్ ఆలీ (26), ఫ్రేజర్‌టౌన్ నివాసి ఆతీష్ (26), ఇమ్తియాజ్ (22) అనే నలుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వీరందరు రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు పాత కార్లు విక్రయించే వ్యాపారం చేస్తున్నారు. విషయం బయటకు రావడంతో నిందితులు అందరూ ఇతర రాష్ట్రాలకు పారిపోయారని నగర అడిషనల్ పోలీసు కమిషనర్ శరత్‌చంద్ర తెలిపారు. వారి కోసం గాలిస్తున్నామన్నారు. యువతిపై అత్యాచారం చేసిన కేసు విషయం తెలిసినా నిర్లక్షంగా విధులు నిర్వహించారన్న ఆరోపణలపై పులకేశీనగర పోలీస్ స్టేషన్ సిఐ మహ్మద్ రఫీక్‌ను సస్పెండ్ చేస్తు పోలీసు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఇదిలా ఉండగా, ఇంతకు ముందు కూడా నాసీర్ అహ్మద్పై ఒక అత్యాచారం కేసు ఉంది. ఒక యువతిపై అత్యాచారం చేసినట్లు భారతీనగర పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయిందని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.
బాధితురాలికి బెదిరింపు కాల్స్!
సామూహిక అత్యాచార బాధితురాలికి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌లు చేసి బెదిరిస్తున్నారు. కేసు వెనక్కు తీసుకోవాలని చెప్పారు. అలా వెనక్కి తీసుకోకపోతే చంపేస్తామని బెదిరించారు. బాధితురాలు తన స్నేహితుడితో కలిసి ఈ రోజు నగర పోలీసు కమీషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్‌ను కలిశారు. నిందితులు చేసిన అరాచకాలు, వారి బెదిరింపు ఫోన్‌ల గురించి క్షుణ్ణంగా వివరించారు.