నీటి కోసం నిరసన స్వరం
చిత్తూరు రహదారిపై ఎస్‌వీ యూనివర్సిటీ విద్యార్థినుల రాస్తారోకో
యూనివర్సిటీ క్యాంపస్(తిరుపతి): శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలోని మహిళా హాస్టల్‌లో తాగునీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఇన్‌చార్జి వైస్ చాన్స్‌లర్ కె.రాజగోపాల్‌ను విద్యార్థినులు బుధవారం ఘెరావ్ చేశారు. హాస్టల్‌లో నీటి సమస్యను తీర్చాలంటూ మంగళవారం రాత్రి విద్యార్థినులు ఆందోళనకు దిగారు. సమస్య పరిష్కారం కాకపోవడంతో బుధవారం వర్సిటీ బంద్‌కు పిలుపునిచ్చారు.
ఉదయం 9 గంటలకే తరగతులను బహిష్కరించి పరిపాలన భవనం వద్దకు చేరుకున్నారు. చిత్తూరు-తిరుపతి ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. అధికారులతో చర్చించి ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తామని ఇన్‌చార్జి వీసీ చెప్పడంతో విద్యార్థినులు ఆందోళన విరమించారు.
తాగునీరు అందించండి: మంత్రి గంటా
మహారాణిపేట(విశాఖపట్నం): ఎస్వీ యూనివర్సిటీలో తాగునీటి సమస్య లేకుండా చూడాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్‌లను ఆదేశించారు. తాగునీటి సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు చేసిన నిరసనపై ఆయన స్పందించారు.