అంగారక యాత్రకు సునీతా విలియమ్స్!
వాషింగ్టన్: అమెరికా అంతరిక్ష సంస్థ నాసా 2030లలో చేపట్టనున్న మానవసహిత అంగారక యాత్రకు భారత సంతతి అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ వెళ్లనున్నారు. పర్యాటకులను అంతరిక్షంలోకి తీసుకెళ్లి, తిరిగి భూమికి తీసుకువచ్చేందుకు సునీతతోపాటు మరో ముగ్గురు వ్యోమగాములు.. రాబర్ట్ బెన్‌కెన్, ఎరిక్ బో, డగ్లస్ హర్లీలను నాసా ఎంపిక చేసింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి, అక్కడి నుంచి అంగారకుడి వద్దకు పర్యాటకులను తీసుకెళ్లే ‘కమర్షియల్ క్రూ వెహికల్స్’ను నడిపేందుకు ఈ నలుగురూ శిక్షణ పొందనున్నారు.
ఈ రోదసి యాత్రల కోసం బోయింగ్, స్పేస్‌ఎక్స్ కంపెనీలతో కలసి సునీత బృందం పనిచేయనుంది. ఈ బృహత్తర యత్నంతో ఈ నలుగురూ చరిత్రలో నిలుస్తారని, అమెరికన్‌లు మార్స్ మీద కాలు మోపుతారని నాసా పేర్కొంది. సునీత(49)ను వ్యోమగామిగా నాసా 1998లో ఎంపిక చేసింది. రెండుసార్లు అంతరిక్ష యాత్రలకు వెళ్లి 322 రోజులు రోదసిలో ఉన్నారు. 50.40 గంటల పాటు రోదసిలో నడిచి అత్యధిక సమయం స్పేస్‌వాక్ చేసిన మహిళా వ్యోమగామిగా రికార్డు సృష్టించారు.