
సింధుపై సూపర్ స్టార్ ట్వీట్.. సంచలనం
ఆయన ఒక్కసారి చెబితే వందసార్లు చెప్పినట్లు.. ఒక్క ట్వీట్ చేస్తే వేల సార్లు చేసినట్లు! అవును, ఒలింపిక్స్ లో రజత పతకం సాధించి జాతిని పులకింపజేసిన పీవీ సింధును ఆశీర్వదిస్తూ సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన ట్వీట్ సంచలనాలు సృష్టిస్తోంది. 'హ్యాట్సాఫ్ పీవీ సింధు.. నేను నీ అభిమానినైపోయా..' అన్న రజనీ ట్వీట్ 24 గంటల వ్యవధిలో దాదాపు 19 వేల సార్లు రీ ట్వీట్ అయింది. (హ్యాట్సాఫ్.. నేను నీ అభిమానినైపోయా!)
సోషల్ మీడియా పట్ల అనాసక్తత ప్రదర్శించే రజనీకాంత్ 2014లో ట్విట్టర్ లోకి ప్రవేశించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు కేవలం 33 ట్వీట్లు మాత్రమే చేశారు. కూతురు సౌందర్య, అల్లుడు ధనుష్, ఐశ్వర్యా రాయ్, అమితాబ్, ప్రధాని మోదీ, ఏఆర్ రెహమాన్.. ఇలా సెలెక్టివ్ గా 23 మందిని మాత్రమే ఫాలో అవుతారు. కానీ రజనీ ఫాలోవర్ల సంఖ్య 30 లక్షల పైమాటే! ఒలింపిక్ బ్యాడ్మింటన్ విమెన్స్ సింగిల్స్ విభాగంలో భాగంగా శుక్రవారం రాత్రి జరిగిన ఫైనల్స్ లో తెలుగు తేజం పీవీ సింధు.. స్పెయిన్ క్రీడాకారిణి కరోలినా మారిన్ పై ఓడినప్పటికీ రజత పతకాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. పలు రంగాల ప్రముఖులేకాక, యావత్ జాతి సింధును అభినందనలతో ముంచెత్తుతున్నారు.
Hats off to you #PVSindhu .... I have become a great fan of yours ... Congratulations !
— Rajinikanth (@superstarrajini) 19 August 2016