కాంపిటేషన్ మధ్యలో షార్క్ ఈడ్చుకెళ్లింది
దక్షిణాఫ్రికా: అది దక్షిణాఫ్రికాలోని ఓ సముద్రం. భారీగా ఎగిసి పడుతున్న అలలు. ఒడ్డున ఆనందంతో ఎగిరి గంతులేస్తున్న భారీ జనం.. చుట్టూ కెమెరాలు. సముద్రపు అలలపై సర్ఫర్లు(చిన్న తెప్పలాంటిదానిపై నిల్చునిగానీ, పడుకొని గానీ సముద్రపు అలలపై రైడింగ్ చేసేవాళ్లు). వేగంగా వారు దూసుకెళుతుండగా వారికి రక్షణగా మరపడవలు. ఇందులో మిక్ ఫ్యానింగ్ అనే ఆస్ట్రేలియా సర్ఫర్ వాయువేగంతో లక్షిత ప్రాంతానికి దూసుకొస్తున్నాడు.
మరికొద్ది సేపటిలో ఒడ్డుకు చేరుకుంటాడనంగా అతడిపై సడెన్గా ఓ షార్క్ దాడి చేసి నీటిలో అమాంతం ముంచివేసి గాయపరిచింది. ఎట్టకేలకు అతడిని అక్కడి సిబ్బంది రక్షించారు. మిక్ ఫ్యానింగ్ ఇప్పటికే సర్ఫింగ్లో మూడు టైటిళ్లు సాధించి లెజెండ్ అని నిరూపించుకున్నాడు. ఆదివారం దక్షిణాఫ్రికాలో 'జే బే సర్ఫ్ ఓపెన్' నిర్వహించగా అందులో పాల్గొన్నాడు.
షార్క్ దాడి ఘటన గురించి ఆయన మాటల్లో చూస్తే 'లక్ష్యం మరికొద్ది దూరంలో ఉండగానే ఎవరో నా కాలు లాగుతున్నట్లు అనిపించింది. మొదటి సారి కాలు విదిలించాను. కొద్ది సేపటి తర్వాత మళ్లీ అలాగే అని పించింది. నేను మళ్లీ అలాగే చేశాను. కొంచెం సేపయ్యాక నా వెనుక ఎవరో ఉన్నట్లుగా అనిపించింది. తిరగి చూసేవరకు భయంకరమైన షార్క్ కోరపళ్లతో ఒక్కసారిగా నాపై విరుచుపడింది. భయంతో కేకలు వేయడం మొదలు పెట్టాను. చాలాసార్లు నన్ను నీటిలో ముంచి లోపలికి ఈడ్చుకెళ్లే ప్రయత్నం చేసింది. నా అరుపులు విని సిబ్బంది వచ్చి రక్షించారు. స్వల్పంగా నాకు గాయమైంది' అని వణికిపోతూ చెప్పాడు. జేబే సర్ఫ్ ఓపెన్ నిర్వాహకులు కూడా విక్ ఫ్యానింగ్ బతికి బయటపడ్డాడు మాకు అదే చాలు అని ఆనందం వ్యక్తం చేశారు.