ట్విట్టర్ లో సుష్మ మంత్రి హోదా మాయం
న్యూఢిల్లీ: వారం రోజుల క్రితం వరకు విదేశీ వ్యవహరాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ట్విట్టర్ పేజీ ఓపెన్ చేసినపుడు.. ఆమె ప్రొఫైల్ లో 'సుష్మా స్వరాజ్, విదేశీ వ్యవహారాల మంత్రి, భారత ప్రభుత్వం' అని ఇంగ్లీషులో ఉండేది. 2014 మేలో విదేశీ వ్యవహరాల శాఖ మంత్రిగా సుష్మ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆమె ట్విట్టర్ పేజీ ఇలాగే కనిపించేది. అయితే ప్రస్తుతం సుష్మ ట్విట్టర్ పేజీలో ఆమె పేరు మాత్రమే కనిపిస్తోంది. సుష్మ హోదాను తెలియజేసే.. 'విదేశీ వ్యవహారాల మంత్రి, భారత ప్రభుత్వం' అన్న పదాలను తొలగించారు.
లలిత్ మోదీ గేట్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సుష్మ మంత్రి పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. రెండు రోజులుగా పార్లమెంట్ సమావేశాలను కూడా స్తంభింపచేశారు. ఈ విషయంపై పార్లమెంట్లో చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నానంటూ మంగళవారం సుష్మ ట్వీట్ చేశారు. ఇక ఈ రోజు కూడా సుష్మ.. పేరు ప్రస్తావించకుండా ఓ కాంగ్రెస్ సీనియర్ నేతపై ట్విట్టర్లో విమర్శలు చేశారు. కాగా ట్విట్టర్ పేజీ ప్రొఫైల్ లో సుష్మ తన హోదా తెలియజేసే పదాలను ఎందుకు తొలగించారన్నది చర్చనీయాంశమైంది.