
కొబ్బరిచిప్పల న్యాయమేంది బాబూ?: టి.హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: రెండు కళ్లు, ఇద్దరు కొడుకుల సిద్ధాంతాలు పోయి టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు కొత్తగా చెబుతున్న కొబ్బరి చిప్పల సిద్ధాంతం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదని టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత టి.హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. పార్టీ ఎమ్మెల్యేలు కొప్పుల ఈశ్వర్, ఏనుగు రవీందర్ రెడ్డి, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావుతో కలిసి తెలంగాణభవన్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
చంద్రబాబు కొబ్బరికాయ సిద్ధాంతం అర్థంగాక వారి పార్టీ నేతలే జుట్టు పీక్కుంటున్నారని హరీశ్‌రావు అన్నారు. చంద్రబాబు మానసిక పరిస్థితి చూస్తే ఆందోళన కలుగుతోందని, ఆయనకు వెంటనే వైద్యపరీక్షలు చేయించాలని టీడీపీ నేతలకు సూచించారు. ఆంటోనీ నేతృత్వంలో ఏర్పాటైన జీవోఎంను గుర్తించం అని ఒకసారి, అఖిలపక్షం వేయాలని మరోసారి కోరిన చంద్రబాబు.. అసలు అఖిలపక్ష సమావేశానికి ఎందుకు హాజరుకాలేదని హరీశ్‌రావు ప్రశ్నించారు.