
యోగి బాటలో ఇద్దరు మంత్రులు
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ బాధ్యతలు చేపట్టిన అనతికాలంలోనే కీలక నిర్ణయాలు తీసుకుంటూ పరిపాలనలో దూసుకుపోతున్నారు. రోజుకు 18 గంటలు పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని, లేకపోతే వెళ్లిపోవచ్చని అధికారులకు యోగి వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. యోగిని స్ఫూర్తిగా తీసుకుని, ఆయన ఆదేశాలతో ఇద్దరు మంత్రులు తమ శాఖల కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఉదయం పది గంటలకు చాలామంది ఉద్యోగులు ఆఫీసులకు రాకపోవడంతో వార్నింగ్ ఇచ్చారు.
యూపీ వ్యవసాయ శాఖ మంత్రి సూర్య ప్రతాప్ షాహి సోమవారం ఉదయం పది గంటలకు తన శాఖ పరిధిలోని కార్యాలయాలను తనిఖీ చేశారు. ఆఫీసుల్లో కుర్చీలు ఖాళీగా కనిపించాయి. ఆ సమయానికి చాలా మంది ఉద్యోగులు ఆఫీసుకు రాలేదు. నిర్ణీత సమయానికి ఉద్యోగులు హాజరు కాకపోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలస్యంగా వచ్చే ఉద్యోగులకు ఓ రోజు జీతం కోత విధించాలని మంత్రి ఆదేశించినట్టు అధికారులు చెప్పారు.
యూపీ మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి మోహ్సిన్ రాజా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నిర్ణీత సమయానికి చాలామంది ఉద్యోగులు హాజరు కాని విషయాన్ని గుర్తించారు. ఉద్యోగుల గైర్హాజరీకి సంబంధించి నివేదిక పంపాలని అధికారులను ఆదేశించారు. ఉద్యోగులకు రాకున్నా ఏసీలు, ఫ్యాన్‌లు పనిచేస్తున్న విషయాన్ని గమనించిన మంత్రి.. విద్యుత్‌ను వృథా చేయవద్దని అధికారులను మందలించారు.