లక్నో: ఫేస్ బుక్, ట్విట్టర్వంటి సామాజిక అనుసంధాన వేధికల్లో అందరికంటే ముందుండే ప్రధాని నరేంద్రమోదీపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ విమర్శలు చేశారు. ఫేస్ బుక్లో తక్కువ మాట్లాడాలని, క్షేత్ర స్థాయిలో ఎక్కువగా పనిచేయాలని సూచించారు. బీజేపీ పార్టీ నాయకులను నియంత్రణలో పెట్టాలని, వారిని ఇతర కార్యకలాపాలపై దృష్టిపెట్టకుండా దేశ అభివృద్ధికి పాటుపడేలా చూడాలని కూడా చెప్పారు.
గురువారం ఆయన ఓ టీవీ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ప్రధాని మోదీ మీకు ఎదురెదురుగా వస్తే ఏం చెప్తారు అని సదరు టీవీ చానెల్ అఖిలేశ్ను ప్రశ్నించగా 'ఫేస్ బుక్లో తక్కువ మాట్లాడండి.. పనిని ఆచరణలో చేసి చూపెట్టండి' అని చెప్తానని బదులిచ్చారు. దాద్రి ఘటనపై ప్రశ్నించగా.. ఈ కేసులో ఏడుగురిని అరెస్టు చేశామని, వీరందరికీ బీజేపీతో సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. వారు భావోద్వేగాలు రెచ్చగొట్టేలా మాట్లాడటం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయని ఆరోపించారు.
'వ్యక్తిగతంగా నేను బీఫ్ తినడానికి వ్యతిరేకుడిని. కానీ ప్రపంచ వ్యాప్తంగా దానిని తింటున్నారు... వాళ్లేమైనా మొత్తం బీఫ్ ఇండస్ట్రీని మూసివేయాలనుకుంటున్నారా? ఎవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దు. ఓ వ్యక్తి తన ఇంట్లో ఏదో ఒకటి తింటున్నాడు. మొన్న జరిగిన ఘటనతో అంతటా చర్చనీయాంశమైంది. ఇప్పుడు ప్రజలంతా మేం బీఫ్ తింటున్నాం వచ్చి చంపేయండి అంటున్నారు.. ఇది భారతీయ సంస్కృతా? ప్రపంచం ఏం చెబుతోంది' అంటూ అఖిలేశ్ బీఫ్ వివాదంపై స్పందించారు. దాద్రి ఘటన అనంతరం ప్రపంచ మీడియా ఏం కథనాలు రాసిందో ఓసారి చదివితే ప్రధాని మోదీ, బీజేపీ చాలా సిగ్గుపడాల్సిందేనిని కూడా అఖిలేశ్ వ్యాఖ్యానించారు.
'మోదీ.. తక్కువ మాట్లాడి ఎక్కువ పనిచేయండి'
Published Thu, Oct 15 2015 11:30 AM | Last Updated on Mon, Oct 22 2018 6:02 PM
Advertisement
Advertisement