తరుణ్ తేజ్‌పాల్‌కు సమన్లు
న్యూఢిల్లీ: మహిళా జర్నలిస్టుపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహల్కా ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌కు మరోసారి చుక్కెదురయింది. అరెస్టు నుంచి మధ్యంతర రక్షణ కల్పించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. పోలీసులు అరెస్టు చేయకుండా తనకు నాలుగు వారాల పాటు రక్షణ కల్పించాలని కోర్టును తేజ్‌పాల్ కోరారు. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్పై నిర్ణయాన్ని కోర్టు ఈనెల 29కి వాయిదా వేసింది.
మరోవైపు తరుణ్ తేజ్పాల్ను అరెస్ట్ చేసేందుకు గోవా పోలీసులు సిద్ధమవుతున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటల్లోపు విచారణ అధికారి ఎదుట హాజరుకావాలని ఆయనకు గోవా పోలీసులు సమన్లు పంపారు. తేజ్పాల్ అరెస్ట్ తప్పకపోవచ్చని గోవా సీఎం మనోహర్ పారికర్ వ్యాఖ్యానించిన కొద్ది సేపటికే సమన్లు జారీ కావడం విశేషం. రేపు తేజ్పాల్ ను అరెస్ట్ చేసే అవకాశముందని అంచనా వేస్తున్నారు. బాధితురాలి వాంగ్మూలం నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని గోవా డీఐజీ ఓపీ మిశ్రా తెలిపారు.
ఈ నెల మొదట్లో గోవాలోని ఓ హోటల్‌లోని లిఫ్ట్‌లో మహిళా జర్నలిస్టును తేజ్‌పాల్ లైంగికంగా వేధించారనే అభియోగంపై గోవా పోలీసులు ఈ నెల 22న ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. తేజ్‌పాల్‌పై ఐపీసీ సెక్షన్లు 376 (అత్యాచారం), 376(2)(కె)(అధికారాన్ని అడ్డం పెట్టుకుని మహిళపై అత్యాచారానికి ఒడిగట్టడం), 354 (దౌర్జన్యం) కింద అభియోగాలు మోపారు. వీటిలో సెక్షన్ 376 కింద ఆరోపణలు రుజుమైతే దోషికి జీవిత కాల శిక్ష పడే అవకాశం ఉంది.