లైంగిక దాడి కేసులో షోమా చౌదరి స్టేట్మెంట్ రికార్డు
తెహల్కా మాజీ మేనేజింగ్ ఎడిటర్ షోమా చౌదరి స్టేట్మెంట్ను గోవా కోర్టు శనివారం రికార్డు చేసింది. సహోద్యోగినిపై తెహెల్కా పత్రిక వ్యవస్థాపక ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ లైంగిక దాడి కేసులో షోమా చౌదరితో పాటు మరో ముగ్గురు ఉద్యోగుల వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ సమక్షంలో రికార్డు చేసేందుకు గోవా పోలీసులు బుధవారం సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.
కోర్టుకు హాజరయ్యేందుకు షోమా చౌదరి శుక్రవారం రాత్రే ఢిల్లీ నుంచి గోవా చేరుకున్నారు. లైంగిక దాడి సంఘటన తెలిసిన మొదటి వ్యక్తి షోమా కావడంతో ఆమె వాంగ్మూలం చాలా కీలకంగా పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు కస్టడీ ముగియటంతో తరుణ్ తేజ్పాల్ను పోలీసులు ఈరోజు కోర్టులో హాజరు పరచనున్నారు. కాగా మరో వారం పాటు తేజ్పాల్ కస్టడీ పొడిగించేందుకు పోలీసులు న్యాయస్థానం అనుమతి కోరనున్నారు. సంస్థలోని మహిళా జర్నలిస్టుపై లైంగిక దాడికి పాల్పడ్డారన్న ఆరోపణలపై గోవా పోలీసులు తేజ్‌పాల్‌ను అరెస్టు చేయడం తెలిసిందే.