ఏ క్షణమైనా తేజ్‌పాల్ అరెస్టు!
ఉచ్చుబిగిస్తున్న గోవా పోలీసులు
నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్ల కోసం కోర్టులో పిటిషన్
శనివారం పోలీసుల ముందు హాజరవుతానని కోరిన తేజ్‌పాల్
నిరాకరించిన ఖాకీలు.. అరెస్టుకు సన్నాహాలు
దీంతో శుక్రవారమే హాజరవుతానని పోలీసులకు మళ్లీ ఫ్యాక్స్
స్టార్ హోటల్‌లో సీసీటీవీ కెమెరాల్లో రికార్డయిన తేజ్‌పాల్ చేష్టలు
వాటన్నింటినీ సేకరించిన పోలీసు అధికారులు
పణజి/న్యూఢిల్లీ: సహోద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహెల్కా ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ చుట్టూ గోవా పోలీసులు ఉచ్చు బిగిస్తున్నారు. ఏ క్షణాన్నైనా అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఆయనను తక్షణమే అరెస్టు చేసేందుకు వీలుగా నాన్-బెయిలబుల్ వారంట్లు జారీ చేయాలని కోరుతూ గురువారం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అంతకుముందు కేసు దర్యాప్తు అధికారి(ఐవో) ముందు హాజరయ్యేందుకు తేజ్‌పాల్ పోలీసుల అనుమతి కోరారు. శనివారం లోపు హాజరవుతానని తన లాయర్ ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. అయితే పోలీసులు అందుకు నిరాకరించారు. దర్యాప్తు అధికారి ముందు గురువారం మధ్యాహ్నం 3 గంటలలోపు హాజరు కావాలని గోవా పోలీసులు తరుణ్ తేజ్‌పాల్‌కు ఇంతకుముందే నోటీసులు జారీ చేశారు. అయితే గడువు ముగియడానికి సరిగ్గా రెండు గంటల ముందు తాను ఇప్పుడు హాజరు కాలేనని, శనివారం లోపు ఐవో ముందుకు వస్తానని తేజ్‌పాల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.
ఆ వెంటనే పోలీసులు చకచకా చర్యలు మొదలు పెట్టారు. తేజ్‌పాల్ వినతిని తిరస్కరిస్తూ... వెంటనే కోర్టు తలుపు తట్టారు. దీంతో తేజ్‌పాల్ అంతకుముందు చెప్పినట్టు శనివారం కాకుండా శుక్రవారమే దర్యాప్తు అధికారి ముందు హాజరవుతానని, కేసు దర్యాప్తులో పూర్తిగా సహకరిస్తానని పేర్కొంటూ పోలీసులకు ఫ్యాక్స్ ద్వారా సమాచారం ఇచ్చారు. అయినా పోలీసులు అరెస్టు చేసేందుకే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. పణజి డీఐజీ ఓపీ మిశ్రా విలేకరులతో మాట్లాడుతూ.. దర్యాప్తు అధికారి చట్టప్రకారం ముందుకు వెళ్తున్నట్టు చెప్పారు. కోర్టు నుంచి నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్లు తెచ్చుకున్నారా అని ప్రశ్నించగా.. ‘‘చట్టప్రకారం ఏం చేయాలో అది చేస్తున్నాం.. దర్యాప్తులో జరుగుతున్న ప్రతి చిన్న విషయాన్ని చెప్పదలుచుకోలేదు’’ అని అన్నారు. నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్ జారీపై పణజిలోని ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ శుక్రవారం ఉదయం తన నిర్ణయం వెలువరించనున్నట్లు తెలిసింది.
సీసీ టీవీల్లో తేజ్‌పాల్ చేష్టలు!
తరుణ్ తేజ్‌పాల్ మహిళా జర్నలిస్టుపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనేందుకు గోవా పోలీసులు తిరుగులేని ఆధారాలను సేకరించారు. ఈనెల 7, 8 తేదీల్లో గోవాలో తేజ్‌పాల్ బస చేసిన స్టార్ హోటల్ సీసీటీవీ కెమెరాల నుంచి వీటిని సేకరించినట్లు పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలను చూస్తుంటే తేజ్‌పాల్ సదరు మహిళా జర్నలిస్టు పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు స్పష్టమవుతోందని ఆయన చెప్పారు. బాధిత మహిళ, తేజ్‌పాల్ రాత్రి 9 గంటల సమయంలో హాలీవుడ్ నటుడు రాబర్ట్ డీ నీరో గదికి వెళ్తున్నట్లు కెమెరాల్లో నమోదైంది. బాధితురాలి భుజంపై చేయి వేసి తేజ్‌పాల్ నడుస్తున్నట్లు అందులో ఉంది. తర్వాత 10.30 గంటల సమయంలో గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఆ మహిళ చేయి పట్టుకొని లాగుతున్నట్టు రికార్డయింది. రెండు నిమిషాల తర్వాత రెండో ఫ్లోర్‌లో లిఫ్ట్ తెరుచుకోగానే అందులోంచి మహిళా జర్నలిస్టు తన దుస్తులను సర్దుకుంటూ వడివడిగా బయటకు వచ్చారు. ఆమె వెనకాలే తేజ్‌పాల్ రావడం కెమెరాల్లో నమోదైంది.
బెయిల్ పిటిషన్ వెనక్కి..
తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను తేజ్‌పాల్ గురువారం వెనక్కితీసుకున్నారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం కోర్టు తీర్పు వెలువరించనుంది. ఈ నేపథ్యంలో తేజ్‌పాల్ లాయర్ సందీప్ కపూర్ పిటిషన్‌ను వెనక్కి తీసుకోవడం గమనార్హం. బెయిల్‌పై తగిన కోర్టుకు వెళ్తామని సందీప్ చెప్పారు.