పనజి/న్యూఢిల్లీ: సహోద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహెల్కా చీఫ్ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌కు బుధవారం గోవా పోలీసుల నుంచి పిలుపొచ్చింది. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ కేసుకు సంబంధించి విచారణాధికారి ముందు హాజరు కావాల్సిందిగా ఆయనను ఆదేశించారు. దాంతో విచారణ అనంతరం తేజ్‌పాల్‌ను అరెస్ట్ చేయొచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి.
బాధిత మహిళా జర్నలిస్టు కూడా బుధవారం గోవా రాజధాని పనజికి వచ్చి స్థానిక కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. మరోవైపు, తనపై రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ కేసు అంటున్న తేజ్‌పాల్ ఆరోపణలను గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ తోసిపుచ్చారు. కాగా, తనను 4 వారాల పాటు అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలన్న తేజ్‌పాల్ అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు బుధవారం తోసిపుచ్చింది.