ఢిల్లీ హైకోర్టుకు తరుణ్ తేజ్‌పాల్
ముందస్తు బెయిల్‌కు పిటిషన్
తెహల్కాకు రాజీనామా చేసిన బాధితురాలు
బాధితురాలితో మాట్లాడిన గోవా పోలీసులు
న్యూఢిల్లీ/పణజి: మహిళా జర్నలిస్టుపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహల్కా ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్ సోమవారం ఢిల్లీ హైకోర్టు తలుపు తట్టారు. ఈ ఉదంతం పై గోవా పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన నేపథ్యంలో అక్కడి కోర్టును ఆశ్రయించే వరకు తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును అభ్యర్థించారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ జీఎస్ సిస్టానీ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారించనుంది. ఈ నెల మొదట్లో గోవాలోని ఓ హోటల్‌లోని లిఫ్ట్‌లో మహిళా జర్నలిస్టును తేజ్‌పాల్ లైంగికంగా వేధించారనే అభియోగంపై గోవా పోలీసులు ఈ నెల 22న ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. తేజ్‌పాల్‌పై ఐపీసీ సెక్షన్లు 376 (అత్యాచారం), 376(2)(కె)(అధికారాన్ని అడ్డం పెట్టుకుని మహిళపై అత్యాచారానికి ఒడిగట్టడం), 354 (దౌర్జన్యం) కింద అభియోగాలు మోపారు. వీటిలో సెక్షన్ 376 కింద ఆరోపణలు రుజుమైతే దోషికి జీవిత కాల శిక్ష పడే అవకాశం ఉంది.
ఆమెతో మాట్లాడాం: గోవా డీఐజీ
ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గోవా పోలీసులు బాధిత జర్నలిస్టుతో మాట్లాడారని గోవా పోలీస్ డీఐజీ ఓపీ మిశ్రా పణజిలో సోమవారం వెల్లడించారు. కేసును విచారిస్తున్న అధికారి ఒకరు ఆమెతో మాట్లాడారన్నారు. అయితే, ఏం మాట్లాడారనే వివరాలను వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు.
బాధితురాలు రాజీనామా.. బాసటగా మరికొందరు
లైంగికదాడి బాధితురాలు, తెహల్కా మహిళా జర్నలిస్టు తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఒత్తిడి నుంచి దూరంగా ఉండేందుకే తానీ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె ఓ వార్తాసంస్థకు తెలిపారు. బాధితురాలు తన రాజీనామాను రెండు రోజుల కిందటే కార్యాలయానికి పంపినట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. మరోపక్క, కేసు విచారణకు సంబంధించి తెహల్కా యాజమాన్యం వైఖరితో నిరాశ చెందిన సంస్థ కన్సల్టింగ్ ఎడిటర్ మజూందార్, అసిస్టెంట్ ఎడిటర్ రేవతి లాల్‌లు కూడా రాజీనామాలు సమర్పించినట్టు తెలిసింది. తెహల్కా లిటరరీ ఎడిటర్ షౌగత్ దాస్‌గుప్తా కూడా అదే బాటలో ఉన్నట్టు సమాచారం. కాగా, ఈ ఘటన తన హృదయాన్ని ఛిద్రం చేసిందని ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్ పేర్కొన్నారు.