ఆరేళ్ల బాలికపై అత్యాచారం: టీచర్ అరెస్టు
కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఓ స్కూల్లో ఆరేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఉపాధ్యాయుడిని పోలీసులు అరెస్టు చేశారు. గడిచిన మూడు నెలల్లో ఇలాంటి కేసు ఇది బెంగళూరులో ఐదోది. మంగళ, బుధ వారాల్లో రెండుసార్లు ఆ బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు సదరు టీచర్ అంగీకరించాడని బెంగళూరు అదనపు పోలీసు కమిషన్ (శాంతిభద్రతలు) అలోక్ కుమార్ తెలిపారు.
స్కూలు నుంచి ఇంటికి వెళ్లిన బాలిక తనకు బాగా నొప్పిగా ఉందని చెప్పడంతో వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా, ఆమెపై లైంగిక దాడి జరిగినట్లు ఆ వైద్యుడు చెప్పారు. దీంతో గురువారం నాడు పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేశామని, కేసు నమోదు చేశామని ముఖ్యమంత్రి సిద్దరామయ్య తెలిపారు. ఎక్కువగా ప్రైవేటు పాఠశాలల్లోనే ఈ తరహా సంఘటనలు జరుగుతున్నాయని, దాంతో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు ఓ సర్క్యులర్ పంపామని ఆయన చెప్పారు.