
టెక్ మహీంద్రా లాభం 718 కోట్లు
సాఫ్ట్‌వేర్ సేవల దిగ్గజం టెక్ మహీంద్రా సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి(క్యూ2) ఆకర్షణీయ ఫలితాలను ప్రకటించింది.
ముంబై: సాఫ్ట్‌వేర్ సేవల దిగ్గజం టెక్ మహీంద్రా సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి(క్యూ2) ఆకర్షణీయ ఫలితాలను ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర లాభం దాదాపు 58% ఎగసి రూ. 718 కోట్లను తాకింది. గతేడాది ఇదే కాలంలో రూ. 456 కోట్లను మాత్రమే ఆర్జించింది. రిటైల్, ట్రావెల్, లాజిస్టిక్స్ తదితర విభాగాలకుతోడు యూరప్ దేశాల నుంచి పెరిగిన డిమాండ్ ఇందుకు దోహదపడినట్లు కంపెనీ పేర్కొంది. ఇదే కాలానికి కంపెనీ ఆదాయం 35%పైగా పుంజుకుని రూ. 4,771 కోట్లకు చేరింది. గతంలో రూ. 4,103 కోట్లు నమోదైంది. కాగా, కంపెనీలో సాఫ్ట్‌వేర్ సేవల దిగ్గజం మహీంద్రా సత్యం విలీనం నేపథ్యంలో కన్సాలిడేటెడ్ ఫలితాలపై ఆడిట్ నివేదికను కోరలేదని కంపెనీ పేర్కొంది. సత్యంను పూర్తిస్థాయిలో విలీనం చేసుకున్నట్లు ఈ ఏడాది జూన్‌లో టెక్ మహీంద్రా వెల్లడించిన విషయం విదితమే. ప్రస్తుత సమీక్షా కాలంలో కంపెనీ రూ. 26 కోట్లమేర ఫారెక్స్ నష్టాలను నమోదు చేసుకుంది. గతంలో ఈ పద్దుకింద రూ. 134 కోట్లను ఆర్జించింది.
డాలర్ల ప్రాతిపదికన సైతం
డాలర్ల ప్రాతిపదికన టెక్ మహీంద్రా ఆదాయం 17.6% పెరిగి 75.8 కోట్ల డాలర్లను తాకింది. త్రైమాసిక ప్రాతిపదికన చూస్తే ఇది 4.7% అధికం. ఇక నికర లాభం మరింత ఎక్కువగా 36.4% జంప్ చేసి 11.4 కోట్ల డాలర్లకు చేరింది. ఫలితాల సందర్భంగా కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్‌చైర్మన్ వినీత్ నయ్యర్ మాట్లాడుతూ భవిష్యత్ తరం వినియోగదారులకు అవసరమైన సేవలను అందించడంతోపాటు, అన్ని విభాగాలనూ సమన్వయపరచడం ద్వారా పటిష్టమైన పనితీరును చూపగలమన్నారు. ఆలోచనాత్మక పెట్టుబడులు, కస్టమర్లపై నిరంతర దృష్టి వంటి అంశాలు భారీ డీల్స్‌కు తోడ్పడుతున్నాయని కంపెనీ ఎండీ సీపీ గుర్నానీ పేర్కొన్నారు. కంపెనీ షేరు బీఎస్‌ఈలో 0.5% బలపడి రూ. 1,580 వద్ద ముగిసింది.
మరిన్ని విశేషాలివీ
మొత్తం సిబ్బంది సంఖ్య 85,234 మందికాగా, సాఫ్ట్‌వేర్ నిపుణుల సంఖ్య 55,432.
రుణ భారాన్ని రూ. 412 కోట్ల నుంచి రూ. 335 కోట్లకు తగ్గించుకుంది.
సెప్టెంబర్ చివరినాటికి నగదు, తత్సమాన నిల్వల విలువ రూ. 3,273 కోట్లుగా నమోదైంది. .