'టి.బిల్లుపై రేపు మాట్లాడనున్న సోనియా'
న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లుపై లోక్సభలో రేపు చర్చ జరుగుతుందని పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై మంగళశారం లోక్సభలో కచ్చితంగా చర్చ జరుగుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. బిల్లుపై సోపియా గాంధీ మాట్లాడే అవకాశముందన్నారు. తెలంగాణ బిల్లును వంద శాతం ఆమోదించి తీరుతామన్నారు. బిల్లును వ్యతిరేకించాలనుకుంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానాలను అనుసరించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ఎంపీల సస్పెన్షన్ తొలగింపుపై లోక్సభ స్పీకర్ మీరాకుమార్ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.
కాగా, కమల్నాథ్తో సీమాంధ్ర కేంద్రమంత్రుల వాగ్వాదానికి దిగారు. ఎలాగైనా విభజన బిల్లును అడ్డుకుని తీరుతామని కావూరి సాంబశివరావు స్పష్టం చేశారు. మరోవైపు స్పీకర్ మీరాకుమార్ అధ్యక్షతన ఈ మధ్యాహ్నం 3 గంటలకు బీఏసీ సమావేశం జరగనుంది.
ఈ వారంలోనే తెలంగాణ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టే అవకాశం కనబడుతోంది. రాజ్యసభ బీఏసీ సమావేశంలో తెలంగాణ బిల్లుపై చర్చించారు. రాజ్యసభలో చర్చకు చైర్మన్ హమిద్ అన్సారీ సమయం కేటాయించారు. ఈ నెల 19 లేదా 20 తేదీల్లో విభజన బిల్లు పెద్దల సభకు వచ్చే అవకాశముంది.