తెలంగాణలో 20న తొలి పరీక్ష
⇒931 ఏఈఈ పోస్టులకు టీఎస్‌పీఎస్సీ ఆన్‌లైన్ (సీబీఆర్) టెస్ట్
⇒ దేశంలోనే తొలిసారిగా సీబీఆర్ విధానం
⇒ 99 పరీక్షా కేంద్రాలు.. 30,783 మంది అభ్యర్థులు
⇒ గంటన్నర ముందే పరీక్షా కేంద్రానికి రావాలని సూచన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) ఉద్యోగార్థుల ఎంపికకు ఈ నెల 20న తొలిపరీక్ష నిర్వహించనుంది. వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న 931 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్(సివిల్) పోస్టుల భర్తీకై టీఎస్‌పీఎస్సీ గత నెలలో నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు(హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్) కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష నిర్వహణ నిమిత్తం ఆయా పట్టణాల్లో మొత్తం 99 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశారు. కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్‌మెంట్(సీబీఆర్) విధానంలో జరగనున్న ఆన్‌లైన్ పరీక్షకు మొత్తం 30,783 మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి పార్వతీ సుబ్రమణియన్ ఆదివారం తెలిపారు. ఒకేసారి 30 వేలమందికిపైగా అభ్యర్థులకు ఆన్‌లైన్‌లో టెస్ట్ నిర్వహించడం దేశంలోనే ప్రప్రథమమని ఆమె పేర్కొన్నారు.
రెండు దఫాలుగా ఆన్‌లైన్ పరీక్షలు
అభ్యర్థులు రెండు దఫాలుగా పరీక్ష రాయాల్సి ఉంటుంది. 20న ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు తొలి సెషన్‌లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ పేపర్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్లో సివిల్ ఇంజనీరింగ్ పేపర్ పరీక్ష జరగనుంది. ప్రతి సెషన్లోనూ 2.30 గంటల సమయం ఉంటుంది. పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు గంటన్నర ముందుగానే చేరుకొని, రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్ ప్రక్రియలను పూర్తి చేసుకోవాలి. అభ్యర్థులు తమ అడ్మిట్(హాల్ టికెట్)కార్డులను www.tspsc.gov.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష మొత్తం ఆంగ్లమాధ్యమంలోనే ఉంటుంది. పరీక్ష రాసేముందు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఇచ్చిన సూచనలను తప్పకుండా చదివితే, పరీక్ష రాయడం మరింత సులభంగా ఉంటుందని అధికారులు సూచించారు.
అభ్యర్థులకు సూచనలు ఇలా..
- పరీక్షాకేంద్రాలకు వెళ్లే ముందు అభ్యర్థులు వెరిఫికేషన్ నిమిత్తం తమ హాల్‌టికెట్‌తోపాటు ఏదైనా ఒరిజినల్ గుర్తింపు ధ్రువీకరణ (పాన్‌కార్డ్, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ, ఆధార్, డ్రైవింగ్ లెసైన్స్ తదితర) పత్రాల్లో ఒకదాన్ని వెంట తీసుకెళ్లాలి.
- అభ్యర్థి ఫొటో, సంతకం ముద్రితమై ఉన్నం దున హాల్‌టికెట్‌ను లేజర్ ప్రింటర్, లేదా కలర్ ప్రింటర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవడం మేలు.
- హాల్‌టికెట్‌లో అభ్యర్థి ఫొటో సరిగా కనిపించనట్లైతే ఆథరైజేషన్ కోసం రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలను వెంట తీసుకెళ్లాలి.
- పరీక్షా కేంద్రానికి ఎటువంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, మొబైల్స్, పెన్‌డ్రైవ్‌లు, బ్లూటూత్‌లు, వాచ్, కాలిక్యులేటర్లు, పర్సులు, పేపర్లు తేకూడదు. ప్రశ్నలకు సంబంధించిన లెక్కలు చేసుకునేందుకు కంప్యూటర్‌లోనే వర్చువల్ కాలిక్యులేటర్ సదుపాయాన్ని కల్పిస్తారు.
- వేలిముద్రల ద్వారా అభ్యర్థిని గుర్తించనున్నందున చేతులకు మెహందీ పెట్టకూడదు.
- ఉదయం సెషన్లో 9.15, మధ్యాహ్నం సెషన్లో 1.45 గంటలకు పరీక్షా కేంద్రాల గేటు వేస్తారు. ఒకసారి గేటు వేశాక ఎట్టి పరిస్థితుల్లోనూ లోనికి అనుమతించరు. ఉదయం 8.30 గంటలకు, మధ్యాహ్నం ఒంటగంట నుంచే పరీక్షాకేంద్రం లోపలికి అనుమతిస్తారు.
- పరీక్షగదిలోకి 40 నిమిషాల ముందు అనుమతిస్తారు. పరీక్ష సమయం పూర్తయ్యే వరకు ఎవరినీ బయటకు పంపరు.
- ప్రతి సెషన్లోనూ 150 నిమిషాల సమయం ఉంటుంది. పరీక్ష మొత్తం ఆంగ్ల మాధ్యమంలోనే ఉంటుంది.
- అంధులు, చేతి వేళ్లు లేని వైకల్య అభ్యర్థులు పరీక్ష రాసేందుకు స్క్రైబ్‌లను ఉపయోగించుకోవచ్చు. అంధులకు మాత్రమే అదనంగా 20 నిమిషాల సమయం ఇస్తారు.