
ప్రజలే ఫైనల్!
27 జిల్లాలతో ముసాయిదా
అభ్యంతరాలు, సలహాల స్వీకరణకు
సెప్టెంబర్ 20 వరకు గడువు
► జిల్లా కలెక్టరేట్లు, సీసీఎల్‌ఏ కార్యాలయంలో సూచనల స్వీకరణ
►ఆన్‌లైన్‌లోనూ వెల్లడించే అవకాశం.. అందుబాటులో ప్రత్యేక వెబ్‌సైట్
► కొత్తగా 17 జిల్లాలు.. 15 రెవెన్యూ డివిజన్లు
► మొత్తం 505 మండలాలు.. కొత్తగా 46 ఏర్పాటు
► నేడు జిల్లాల రూపురేఖలతో జీఐఎస్, డిజిటల్ మ్యాపుల విడుదల
►మెజారిటీ ప్రజల అభిప్రాయం మేరకే
► జిల్లాల ఏర్పాటు: మహమూద్ అలీ
సాక్షి, హైదరాబాద్
జిల్లాల పునర్విభజనలో మెజారిటీ ప్రజల అభిప్రాయమే అంతిమమని.. ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలను స్వీకరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు 27 జిల్లాలతో కూడిన ముసాయిదాను సోమవారం విడుదల చేసింది. తాము ఏ జిల్లా, మండలంలో ఉండాలనుకుంటున్నారో ప్రజలు అభ్యర్థించవచ్చని స్పష్టం చేసింది. అన్ని జిల్లాల కలెక్టరేట్లు, హైదరాబాద్‌లోని సీసీఎల్‌ఏ కార్యాలయంతోపాటు ఆన్‌లైన్‌లోనూ అభిప్రాయాలను వెల్లడించవచ్చని తెలిపింది. ఈ మేరకు కొత్త జిల్లాల ముసాయిదాను రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర, సీసీఎల్‌ఏ రేమండ్ పీటర్‌లతో కలసి డిప్యూటీ ముఖ్యమంత్రి మహమూద్ అలీ విడుదల చేశారు.
అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘‘జిల్లాల పునర్విభజన ముసాయిదా ప్రకటనను విడుదల చేశాం. ముఖ్యమంత్రి, అధికారులు తీవ్ర కసరత్తు చేసి ముసాయిదాను రూపొందించారు. ప్రజల సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలు.. రాజకీయ పార్టీలు, నాయకుల కోసం కాదు. ముసాయిదాపై ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలు, సూచనల స్వీకరణ కోసం 30 రోజుల సమయం కేటాయించాం. ఈ ముసాయిదాయే ఫైనల్ కాదు.. ప్రజలే ఫైనల్. మెజారిటీ ప్రజలు.. 51 శాతంపైగా మంది ఏం చెబితే అదే చేస్తాం..’’ అని మహమూద్ అలీ పేర్కొన్నారు. ప్రజల సలహాలు, అభ్యంతరాలే కీలకమని చెప్పారు. కొత్త జిల్లాల ముసాయిదాపై అన్ని జిల్లాల కలెక్టరేట్లు, హైదరాబాద్‌లోని సీసీఎల్‌ఏ కార్యాలయంలో అభ్యంతరాలు, సలహా లను తెలపవచ్చని.. అందుకోసం కలెక్టరేట్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇక http://newdistrictsformation.telangana. gov.in వెబ్‌సైట్‌లోనూ అభ్యంతరాలు, సూచనలను వెల్లడించవచ్చని తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణ ముగిశాక.. మళ్లీ అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేసి మరోసారి వారి అభిప్రాయాలు సేకరిస్తామన్నారు. ముసాయిదా ప్రకటన జారీ చేసిన సోమవారాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటే... సెప్టెంబర్ 20వ తేదీ వరకు అభ్యంతరాలు, సలహాలు తెలిపేందుకు అవకాశం ఉండనుంది.
ప్రజల అభీష్టం మేరకే..
ఉద్యమ కాలంలో కేసీఆర్ గ్రామ గ్రామాలకు తిరిగినప్పుడు.. కలెక్టర్ కార్యాలయానికి వెళ్లేందుకు 100 కిలోమీటర్లకుపైగా దూరం వెళ్లాల్సి వస్తోందని, కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేసేవారని మహమూద్ అలీ చెప్పారు. అందుకే టీఆర్‌ఎస్ మేనిఫెస్టోలో కొత్త జిల్లాల ఏర్పాటు హామీని చేర్చారన్నారు. రంగారెడ్డి, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ జిల్లాలు చాలా పెద్దగా ఉండడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని.. చిన్న జిల్లాలతో పరిపాలన మెరుగుపడుతుందని చెప్పారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర, సీసీఎల్‌ఏ రేమండ్ పీటర్, జిల్లా కలెక్టర్లు రాత్రింబవళ్లు శ్రమించి ముసాయిదాకు తుది రూపు ఇచ్చారని తెలిపారు.
నేడు మ్యాపుల విడుదల
ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణ కోసమే నిబంధనల మేరకు ముసాయిదా ప్రకటన జారీ చేశామని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి ప్రదీప్ చంద్ర చెప్పారు. అన్ని అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకునే అవకాశం లేకపోయినా... మెజారిటీ ప్రజల అభిప్రాయానికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. మంగళవారం సాయంత్రంలోగా వెబ్‌సైట్లో కొత్త జిల్లాల ముసాయిదాకి సంబంధించిన జీఐఎస్ మ్యాపులు, డిజిటల్ మ్యాపులను అందుబాటులో ఉంచుతామని సీసీఎల్‌ఏ కమిషనర్ రేమండ్ పీటర్ తెలిపారు.
జిల్లాల పునర్విభజన ముసాయిదాలోని ముఖ్యాంశాలు
మొత్తం జిల్లాలు : 27
కొత్తగా ఏర్పాటయ్యేవి : 17
మొత్తం రెవెన్యూ డివిజన్లు : 60
కొత్తగా ఏర్పాటయ్యే డివిజన్లు : 15
మొత్తం మండలాలు : 505
కొత్తగా ఏర్పాటయ్యే మండలాలు : 46
కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాలు
1. ఆచార్య జయశంకర్ (భూపాలపల్లి)
2. హన్మకొండ
3. జగిత్యాల
4. కామారెడ్డి
5. కొమురం భీం (మంచిర్యాల)
6. కొత్తగూడెం
7. మహబూబాబాద్
8. మల్కాజ్‌గిరి
9. నాగర్ కర్నూల్
10. నిర్మల్
11. పెద్దపల్లి
12. సంగారెడ్డి
13. శంషాబాద్
14. సిద్దిపేట
15. సూర్యాపేట
16. వనపర్తి
17. యాదాద్రి
కొత్తగా ఏర్పాటయ్యే రెవెన్యూ డివిజన్లు
1. బెల్లంపల్లి
2. భైంసా
3. కోరుట్ల
4. హన్మకొండ
5. హుజూరాబాద్
6. భూపాలపల్లి
7. వైరా
8. కోదాడ
9. అచ్చంపేట
10. కీసర
11. తూప్రాన్
12. జహీరాబాద్
13. గజ్వేల్
14. నారాయణఖేడ్
15. బాన్సువాడ
కొత్తగా ఏర్పాటు చేసే మండలాలు
– ఆదిలాబాద్ జిల్లాలో మావల, నస్పూర్
– కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ రూరల్, కొత్తపల్లి, అంతర్గాం, ఇల్లంతకుంట
– వరంగల్ జిల్లాలో ఖాజీపేట, చిల్పూర్, వేలేరు, ఇల్లందకుంట, ఖిల్లా వరంగల్, ఐనవోలు
– నల్లగొండ జిల్లాలో గట్టుప్పల్, మాడ్గులపల్లి, తిరుమలగిరి (సాగర్), కొండమల్లెపల్లి, నాగారం, అనంతగిరి, మోటకొండూరు, అడ్డగూడూరు
– మహబూబ్‌నగర్ జిల్లాలో మహబూబ్‌నగర్ రూరల్, రాజాపూర్, మరికల్, పదర, అమరచింత, నందిన్నె
– రంగారెడ్డి జిల్లాలో దుండిగల్, జవహర్‌నగర్, అబ్దుల్లాపూర్, బాలాపూర్, గండిపేట్
– మెదక్ జిల్లాలో సిర్గాపూర్, అమీన్‌పూర్, గుమ్మడిదల, సిద్దిపేట రూరల్, రాజంపేట్
– నిజామాబాద్ జిల్లాలో రామారెడ్డి, నిజామాబాద్ నార్త్, నిజామాబాద్ రూరల్, ముగ్పాల్, ఇందల్వాయి, ఆలూర్, మెండోరా, రుద్రూరు
– ఖమ్మం జిల్లాలో రఘునాథపాలెం, చిన్నంబావి