
ప్రగతిభవన్‌లో కేరళ సీఎంకు జ్ఞాపికను అందజేస్తున్న కేసీఆర్
- సీఎం కేసీఆర్ వెల్లడి.. కేరళ సీఎం విజయన్‌కు విందు
- శబరిమలలో తెలంగాణ భవన్ నిర్మాణంపై చర్చ
- రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు వివరించిన సీఎం
సాక్షి, హైదరాబాద్: సీపీఎం మహాజన పాదయాత్ర ముగింపు సభలో పాల్గొనేందుకు రాష్ట్రానికి వచ్చిన కేరళ సీఎం పినరయి విజయన్ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఆదివారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ను కలుసుకున్నారు. అక్కడే సీఎం కేసీఆర్‌తో కలసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులు పరస్పరం వారి ఆలోచనలు పంచుకున్నారు. రెండు రాష్ట్రాల అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ప్రధానంగా చర్చించటంతోపాటు త్వరలోనే కేరళ–తెలంగాణ మధ్య ఐటీ సంబంధ ఒప్పందం జరుగుతుందని వెల్లడించారు. అందుకు సంబంధించి ప్రాథమిక చర్చలు జరిపారు.
శబరిమలలో తెలంగాణ భవన్ నిర్మాణంపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. అందుకు త్వరగా భూమిని కేటాయించాలని విజయన్‌ను కేసీఆర్ కోరారు. ఇప్పటికే చేసుకున్న ఎంవోయూను ప్రస్తావించారు. స్థల కేటాయింపు అంశం ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు వద్ద పెండింగ్‌లో ఉందని విజయన్ వెల్లడించారు. తెలంగాణ నుంచి శబరిమలకు లక్షలాది మంది భక్తులు వెళ్తారని, అందుకే ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని కేసీఆర్ కోరారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలో తెలంగాణ నంబర్ వన్‌గా నిలిచినందుకు విజయన్ అభినందనలు తెలిపారు. అవినీతిరహిత కొత్త పారిశ్రామిక విధానంతో తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని ఈ సందర్భంగా కేసీఆర్ వివరించారు. టీఎస్‌ఐపాస్ విధాన ప్రతిని విజయన్‌కు అందజేశారు.
విదేశీ కంపెనీల ఆసక్తి..
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయన్న సీఎం.. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌తో సహా రాష్ట్రంలో అమలవుతున్న ఇతర సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. టూరిజం, హెల్త్ టూరిజం, హైదరాబాద్‌లో ఐటీ పరిశ్రమ విస్తరిస్తున్న తీరును మంత్రి కేటీఆర్ వివరించారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన మైక్రోసాఫ్ట్, గూగుల్, ఆపిల్ కంపెనీలు హైదరాబాద్‌లో హెడ్ క్వార్టర్స్ ఏర్పాటు చేసుకున్నాయని గుర్తుచేశారు. హైదరాబాద్ లో శాంతి భద్రతలు, భౌగోళిక స్థితిగతులు, భూకంపరహిత వాతావరణం ప్రపంచ ఐటీ రంగాన్ని విశేషంగా ఆకట్టుకుంటున్న అంశాలుగా మంత్రి వివరించారు. ల్యాండ్ రికార్డుల భద్రత అంశం ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య ప్రస్తావనకు వచ్చింది. నిజాంకాలం నాటి నుంచీ రికార్డులను భద్ర పరచిన తీరును వివరించిన సీఎం కేసీఆర్.. ఇటీవల ఉచితంగా సాదా బైనామాల రిజిస్ట్రేషన్ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.
ఒకరిపై ఒకరు తమకున్న నమ్మకం, విశ్వాసంతో తెల్ల కాగితంపై చేసుకున్న సాదా బైనామాలను రిజిస్ట్రేషన్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే 11.5 లక్షల దరఖాస్తులు అందాయని, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. ఈ సందర్భంగా కేరళ సహజ సౌందర్యంపైనా ఇరువురు మాట్లాడుకు న్నారు. కేరళ భూతల స్వర్గం అని కేసీఆర్ కితాబిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ ఉన్నతాధి కారులు పాల్గొన్నారు.