సాక్షి, హైదరాబాద్:తెలంగాణ ముసాయిదా బిల్లు, విభజన అంశంపై జీవోఎం నివేదిక కేంద్ర మంత్రిమండలి ముందుకు రానున్న నేపథ్యంలో కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు రాజకీయ పార్టీల నేతలకు ఫోన్లు చేసి పలు అంశాలపై ఆరా తీశాయి. పది జిల్లాలతో కూడిన తెలంగాణకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసిన తర్వాత విభజన ప్రక్రియపై కేంద్రం మంత్రుల బృందాన్ని (జీవోఎం) ఏర్పాటు చేయడమే కాకుండా వివిధ రాజకీయ పార్టీల నుంచి అభిప్రాయాలు సేకరించిన విషయం తెలిసిందే. అయితే త్వరలో కేబినెట్ భేటీ జరగనున్న నేపథ్యంలో.. ఇంటెలిజెన్స్ వర్గాలు రాయల తెలంగాణ ఏర్పాటు చేయడం వల్ల వచ్చే ఇబ్బందులు, ఈ విషయంలో మీకున్న అభ్యంతరాలేమిటంటూ ఆరా తీయడం గమనార్హం. విభజన ప్రక్రియలో కేంద్రం తొలినుంచీ గందరగోళ పరిస్థితులను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న సంగతి విదితమే.
తాజాగా ఆదివారం టీఆర్‌ఎస్ ముఖ్యులకు, తెలంగాణ జేఏసీ నేతలకు ఫోన్లు చేసిన నిఘా వర్గాలు.. పది జిల్లాల తెలంగాణకు అనంతపురం, కర్నూలు జిల్లాలను అదనంగా కలపడం వల్ల వచ్చే నష్టమేంటని ఆరా తీశాయి. రెండు జిల్లాలను అదనంగా కలపడం వల్ల వచ్చే ఇబ్బందులు ఏమిటి? తెలంగాణ ప్రజలకు జరిగే నష్టం ఏమిటి? రాయల తెలంగాణకు అంగీకరించకుంటే అసెంబ్లీలో తీర్మానం నెగ్గదు కదా? హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటే అభ్యంతరాలేమిటి? ఎలాంటి ఆంక్షలు మీకు ఆమోదయోగ్యం కాదు? తదితర ప్రశ్నలు సంధించినట్టు జేఏసీ నేతలు వివరించారు. ఎలాంటి ఆంక్షలూ లేని హైదరాబాద్‌తో కూడిన 10 జిల్లాల తెలంగాణ ఏర్పాటు తప్ప మరేదీ తమకు ఆమోదయోగ్యం కాదని నిఘా అధికారులకు స్పష్టం చేసినట్లు జేఏసీ, టీఆర్‌ఎస్ నేతలు తెలిపారు.
రాయల తెలంగాణతో నష్టం ఏమిటి?
Published Mon, Nov 25 2013 12:59 AM | Last Updated on Sat, Sep 2 2017 12:57 AM
Advertisement