వాళ్లు హత్యకు గురైన అన్ని సందర్భాల్లోనూ ఆయా జాతులు తీవ్ర ఉద్వేగానికి గురయ్యాయి. దేశాలు దిక్కులేని స్థితిలోకి వెళ్లిపోయాయి. గంటలు, రోజుల వ్యవధిలోనే పరిస్థితులు మళ్లీ సాధారణస్థాయికి చేరుకున్నాయి. అంతలోనే ఇంకో హత్యోదంతం. వాళ్లిప్పుడు లేరు. కాలంలో కలిసిపోయారు. రాజకీయాల్లో మహిళల ప్రయాణం.. నల్లేరుపై కాదు, రక్తపుటేరులపై సాగుతున్నదని వాళ్లు చెప్పారు. అందుకు సాక్ష్యంగా మరణ సందేశాలు వినిపిస్తున్నారు. ఇది ప్రపంచ మహిళా రాజకీయ నేతల 'రక్త'చరిత్ర..
బ్రిటన్ లోని బిర్స్టల్ లో గతవారం మహిళా ఎంపీ జో కాక్స్ ను బహిరంగంగా కాల్చిచంపిన సంఘటన ఆ దేశంలో మహిళా రాజకీయ నేతల భద్రతలో లోపాలను ఎత్తిచూపింది. ఇప్పుడు బ్రిటన్ ఎంపీ కాక్సే కాదు గతంలో భారత మాజీ ప్రధాని, పాకిస్థాన్, రువాండా, స్పెయిన్, మెక్సికో లాంటి పలు దేశాల్లో మహిళలు ప్రభుత్వ పరంగానో, పార్టీ పరంగానో అత్యున్నత పదవిలో ఉండగానే దారుణ హత్యలకు గురయ్యారు.
జో కాక్స్ - బ్రిటన్ ఎంపీ(ప్రతిపక్ష లేబర్ పార్టీ)
బ్రిటన్.. యురోపియన్ యూనియన్ (ఈయూ) లో కలిసే ఉండాలా? ఈయూ నుంచి విడిపోవాలా? అనే అంశంపై గురువారం(జూన్ 23న) ఆ దేశంలో రెఫరెండం జరగనుంది. ప్రతిపక్ష లేబర్ పార్టీ.. బ్రిటన్ ఈయూలోనే కొనసాగాలనే వాదనకు మద్దతు పలుకుతోంది. బాధ్యత గల ఎంపీగా పార్టీ నిర్ణయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్దామనుకున్న ఆమె.. తన నియోజకవర్గం బిర్ స్టల్ పర్యటనకు వెళ్లారు. అక్కడ ఆమెను ఓ దుండగుడు తుపాకితో కాల్చి చంపాడు. బ్రిటన్ ఈయూలో కలిసి ఉండటం ఇష్టంలేకే ఎంపీని హత్యచేశానని పోలీసు దర్యాప్తులో చెప్పాడు.
ఆనా లిండ్- స్విడన్ విదేశాంగ మంత్రి (సోషల్ డెమోక్రటిక్ లీగ్)
స్విడన్ విదేశాంగ శాఖ మంత్రిగా అద్భుతమైన పనితీరుతో మెప్పించిన ఆనా లిండ్.. తర్వాతి ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థినిగా దాదాపు ఖరారైపోయారు. అయితే 2003లో స్టాక్ హోమ్ లోని ఓ డిపార్ట్ మెంటల్ స్టోర్ లో ఆనా దారుణహత్యకు గురయ్యారు. రాజకీయ నాయకులన్నా, నాయకురాళ్లన్నా తనకు ఇష్టం ఉండదని, ఆ పగతోనే ఆమెను చంపానని ఆనా హంతకుడు ప్రకటించుకున్నాడు.
బెనజీర్ భుట్టో- పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి (పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ)
అధికారిక ఇస్లామిక్ దేశమైన పాకిస్థాన్ లో వారసత్వరాజకీయాల ద్వారా తెరపైకి వచ్చి, తర్వాత తనదైన ముద్రతో పరిపాలన సాగించిన బెనజీర్ భుట్టో రెండు పర్యాయాలు ప్రధానమంత్రి పదవి చేపట్టారు. ఎన్నికల్లో ఓటమితో 1998లో తనకుతానుగా ప్రవాసంలోకి వెళ్లిపోయిన బెనజీర్.. 2007లో తిరిగి పాకిస్థాన్ గడ్డపై అడుగుపెట్టారు. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీని మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు కాలికి బలపం కట్టుకుని తిరిగారు. అలా రావల్సిండిలోని ఓ ఎన్నికల సభలో పాల్గొన్న ఆమె.. ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడిలో చనిపోయారు.
ఇందిరా గాంధీ- భారత మాజీ ప్రధానమంత్రి(ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ)
భారత దేశపు మొట్టమొదటి ప్రధాని కూతురిగా, మొదటి మహిళా ప్రధానిగా ఇందిరా గాంధీ రాజకీయ ప్రస్థానం ఆద్యంతం చారిత్రక ఘట్టంలా సాగింది. ఖలిస్థాన్ ఉద్యమాన్ని అణిచివేసే క్రమంలో ఆమె ప్రభుత్వం చేపట్టిన 'ఆపరేషన్ బ్లూ స్టార్' చివరికి ఆమె ప్రాణాలనే తీసుకుంది. 1984లో బాడీగార్డ్ గా విధులు నిర్వహిస్తున్న సిక్కు వ్యక్తి ప్రధాని ఇందిరాగాధీని కాల్చిచంపాడు.
అగాథే ఉవిలింగ్జిమనా అలియాస్ మేడం అగాథే- రువాండా మాజీ ప్రధానమంత్రి
మేడం అగాథేగా ప్రపంచ ఖ్యాతి పొందిన అగాథే ఉవిలింగ్జిమనా జీవితం ఆఫ్రికా రాజకీయ చరిత్రలోనే అరుదైన అధ్యాయం. అనిశ్చితికి మారుపేరైన రువాండాకు మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా ఆమె చేసిన సేవలు వెలకట్టలేనివి. 1994లో బెల్జియన్ స్పీకర్లతో కలిసి ఓ సమావేశంలో పాల్గొన్న ఆమెను దుండగులు కాల్చిచంపారు. ఆమె చనిపోయిన తర్వాతి రోజే నాటి రువాండా అధ్యక్షుడు కూడా హత్యకు గురయ్యాడు.
అఖ్విలా అల్ హషీమి - ఇరాకీ రాజకీయవేత్త
ఇరాక్ ను నియంతలా పాలించిన సద్దాం హుస్సేన్ తన ప్రభుత్వంలో ఒకేఒక మహిళకు ప్రాతినిథ్యం కల్పించారు. ఆమె అఖ్విలా అల్ హషీమీ. కీలకమైన గవర్నింగ్ కౌన్సిల్ లో సభ్యురాలు కాకముందు పలు ఉద్యమాలకు సారధ్యం వహించారామె. 2003లో బాగ్ధాద్ లోని ఇంట్లో ఆరుగురు సాయుధులు మాటువేసి ఆమెను చంపారు. సద్దాం హుస్సేనే ఆమెను చంపాడని కొందరు, లేదు అమెరికా దళాలే ఆమెను హతమార్చాయని మరికొందరు వాదిస్తారు.
హనీఫా సాఫి- మహిళా సంక్షేమ శాఖ మాజీ మంత్రి (అఫ్ఘానిస్థాన్)
కీచక రాజ్యానికి నకలుగా సాగిన తాలిబన్ల పాలనలో మహిళల హక్కులకోసం నినదించి, అనేక పోరాటాలుచేసింది హనీఫా సాఫి. అఫ్ఘానిస్థాన్ లో తాలిబన్ల ప్రాబల్యం ఉన్న కాబుల్ ప్రాంతంలో వారికి వ్యతిరేకంగా పలు ఉద్యమాలకు నేతృత్వం వహించింది. 2012లో ఓ వివాహానికి వెళ్లివస్తోండగా ఆమె ప్రయాణిస్తున్నకారును తాలిబన్లు పేల్చేశారు.
ఇసబెల్ కురాస్కో- స్పెయిన్ మాజీ గవర్నర్
ఉత్తర స్పెయిన్ లోని లియోన్ ప్రావిన్స్ గవర్నర్ గా, పాపులర్ పార్టీ కీలక నేతగా భవిష్యత్ దేశాధినేతగా పేరుతెచ్చుకున్న ఇసబెల్ కురాస్కో 2014లో అనూహ్యరీతిలో హత్యకు గురయ్యారు. తన కూతురు ఉద్యోగం కోల్పోవడానికి గవర్నర్ ఇసబెలే కారణమని నమ్మిన ఓ వ్యక్తి.. కూతురు సహాయంతోనే ఇసబెల్ ను కాల్చిచంపాడు.
సాదూ అలీ వర్సమే- ప్రముఖ సోమాలీ గాయని, (సోమాలియా మాజీ ఎంపీ)
సాంప్రదాయ సోమాలీ గీతాలాపనలతో ప్రపంచ ఖ్యాతిగాంచిన గాయని సాదూ అలీ వర్సమే.. సోమాలియా రాజకీయాల్లోకి ప్రవేశించి ఎంపీగా ఎన్నికయ్యారు. సోమాలియాను ఆధునిక రాజ్యంగా మార్చాలన్న ఆమె కలలు కల్లలుగానే మిగిలిపోయాయి. 2014లో రాజధాని మొగదిషులో కారులో వెళుతున్న ఆమెపై అల్ షబాబ్ ఉగ్రవాదులు దాడిచేశారు. కారుతోసహా ఆమెనూ తూట్లుతూట్లుగా పేల్చేశారు.
జారా షాహిద్ హుస్సేన్- పాక్ రాజకీయనాయకురాలు
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ స్థాపించిన తెహ్రీక్ ఏ నిన్సాఫ్ పార్టీలో కీలక నాయకురాలిగా ఎదిగిన జారా షాహిద్ హుస్సేన్ ను 2013లో ఉగ్రవాదులు కాల్చిచంపారు. కరాచీలోని తన ఇంటి పెరట్లో వాకింగ్ చేస్తున్న ఆమెను ఉగ్రవాదులు దారుణంగా చంపడం అప్పట్లో సంచలనం రేపింది.
గిసెలా మోటా- మెక్సికో సిటీ మాజీ మేయర్
ప్రపంచ మాదకద్రవ్యాల అడ్డాగా పేరుపొందిన మెక్సికో సిటీకి మొట్టమొదటి మహిళా మేయర్ గా ఎన్నికైన గిసెలా మోటా ఇటీవలే హత్యకు గురయ్యారు. మాఫియాపై కఠిన వైఖరి అవలంభిస్తున్న కారణంగానే ఆమె హత్య జరిగినట్లు తెలుస్తోంది.
ఇది.. మహిళా రాజకీయ 'రక్త'చరిత్ర
Published Tue, Jun 21 2016 6:24 PM | Last Updated on Mon, Sep 4 2017 3:02 AM
Advertisement
Advertisement