మోదీ-షా ఆమోదం ఎందరికి?
బిహార్ ఓటమితో వ్యతిరేకుల గళానికి బలం
► పార్టీలో, పాలనలో అగ్ర ద్వయం దూకుడు తగ్గేనా?
► అభివృద్ధి నినాదం వదిలి.. హిందుత్వ విధానాల వైపు
►ఎన్నికల్లో సంఘ్ అజెండా ప్రయోగంతో పరాజయం
► సంఘ్ అజెండా అమలుకు కొంత విరామం?
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీలో గత లోక్‌సభ ఎన్నికల నాటి నుంచి.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాలకు ఎదురనేదే లేదు. వారి ఆదేశమే శాసనం. ఢిల్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురైనా.. ఈ ద్వయానికి తొలి ఓటమి కావటంతో దాని ప్రభావం పార్టీపై పెద్దగా కనిపించలేదు. కానీ.. దేశ రాజకీయాల్లో కీలకమైన బిహార్ ఎన్నికల్లో ఘోరంగా చతికిలపడటంతో ఇప్పుడు అందరి చూపూ ఈ జోడీపై పడుతోంది. ఇప్పటివరకు దక్కిన విజయాలు వీరి వల్లేనా? అయితే పరాజయం కూడా వీరి ఖాతాలో ఎందుకు వేయకూడదు? అని ఎన్డీఏ కూటమిలోని శివసేన పార్టీ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.
ముందుముందు ఈ చర్చ సొంత పార్టీలోనూ రాక తప్పేట్లు లేదు. వీరి జోడీ అందరికీ ఆమోదం కాకపోవడమే దీనికి కారణం. ఈ ద్వయానికి వ్యతిరేక వర్గం పార్టీలో ఉన్నప్పటికీ.. వ్యతిరేకత ప్రదర్శించేందుకు సరైన సమయం, సందర్భం రాలేదని.. బిహార్ అసెంబ్లీ ఫలితాల్లో చతికిలపడిన తరువాత వ్యతిరేక గళాలకు బలం చేకూరుతుందనడంలో సందేహం లేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీ సీనియర్ నేత అద్వానీ, సుష్మాస్వరాజ్ వంటి అగ్రనేతలకు ఎన్నికల ముందు నుంచే మోదీ వ్యతిరేక వర్గంగా ముద్ర ఉంది. అయితే 2014 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి దక్కిన అతిపెద్ద విజయం కారణంగా ఆ వ్యతిరేకత బయటపడలేదు. ఎన్నికల అనంతరం, పగ్గాలు చేపట్టిన ఈ ఏడాది కాలంలో వీరిద్దరికి తోడు ప్రభుత్వంలోని, పార్టీలోని సీనియర్ నేతల్లో చాలా మందికి మోదీ, షా జోడీపై అసంతృప్తి రాజుకుంది. ఈ జాబితాలో హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వంటి వారు కూడా ఉన్నారని చెప్తుంటారు.
అభివృద్ధి అజెండా నుంచి పక్కకు?
అభివృద్ధే అజెండా అంటూ ప్రజల్లో విశ్వాసం నింపి అధికారంలోకి వచ్చిన బీజేపీ.. కొద్ది రోజులు అభివృద్ధి మంత్రాన్నే జపించింది. ఆ తర్వాత క్రమేణా.. పార్టీ సంప్రదాయ ధోరణులనే అనుసరించింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో హిందుత్వ అజెండాను తెరపైకి తెచ్చింది. నిరుటి సాధారణ ఎన్నిక ల వేళ యూపీలో ఇదే తరహా అజెండాతో ముందుకెళ్లిన అమిత్‌షా.. ఇప్పుడు బిహార్ ఎన్నికల్లోనూ ఇదే ఫార్ములాను ప్రయోగించి విఫలమయ్యారు. ఒకవైపు పార్టీ నుంచి, సంఘ్ నుంచి హిందుత్వ అజెండాను విస్తృతంగా ప్రోత్సహిస్తుండటంతో.. సర్కారు అభివృద్ధి పథకాలను కొనసాగిస్తున్నా జనం విశ్వసించలేదు.
అందువల్ల ఇన్నాళ్లూ బయట గెలుస్తూ.. ఇంట శాసిస్తూ వచ్చిన ఈ జోడీకి ఇప్పుడు పార్టీలోని వ్యతిరేక గ్రూపుల అసమ్మతి సెగ తగలవచ్చు. అదే జరిగితే.. మరో రెండు నెలల్లో అధ్యక్ష పదవీ కాలం ముగియనున్న అమిత్‌షా నుంచి పార్టీ పగ్గాలను తప్పించే పరిస్థితి వస్తుంది. ఇప్పటికిప్పుడు కాకపోయినా.. పరిస్థితులకు అనుగుణంగా ఈ మార్పు తప్పకపోవచ్చు. బిహార్ ఫలితాల ప్రభావం రాబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపైనా ఉంటుంది. ముఖ్యంగా పశ్చిమబెంగాల్, కేరళ, తమిళనాడు, అస్సాం, పుదుచ్చేరి వంటి రాష్ట్రాల్లో హిందుత్వ అజెండా ఏమాత్రం పనిచేయదు.
అజెండా మళ్లీ మారుతుందా?
బిహార్ ఎన్నికల్లో ప్రధాని మోదీ 30 సభల్లో ప్రసంగించారు. కానీ బీజేపీ.. దళిత వ్యతిరేకి, రిజర్వేషన్లకు వ్యతిరేకి అని ప్రజల్లో ఉన్న ముద్రను మాత్రం తొలగించలేకపోయారు. 2014లో అభివృద్ధి మార్గానికి దివిటీలా కనిపించిన మోదీకి బ్రహ్మరథం పట్టి 22 ఎంపీ స్థానాలు కట్టబెట్టిన బిహార్ ప్రజలు ఇప్పుడు ఎందుకు ఆయన్ను విశ్వసించలేదు? దాద్రీ ఘటనపై రాద్ధాంతం జరుగుతున్నా.. ప్రధాని, అమిత్‌షా దీనికి ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం చేయలేదు. పైగా అసహనం పేరుతో అవార్డులు తిరిగిస్తున్నవారంతా బీజేపీ వ్యతిరేకులని రెచ్చగొట్టే ధోరణిలోనే పార్టీ నేతలు విమర్శలు కొనసాగారు. దీని ఫలితంగానే బిహార్‌పై పట్టు కోల్పోయింది. పార్టీ అనుసరించిన అజెండా తప్పని రుజువైంది. ఆర్‌ఎస్‌ఎస్ అజెండాకు కాస్త విరామం ఇవ్వదలిస్తే.. సాధ్వి నిరంజన జ్యోతి, యోగి ఆదిత్యనాథ్ వంటి వారి దూకుడుకు ముకుతాడు వే సే అవకాశం ఉంది. ఆర్థిక సంస్కరణలపై ముందుకు వెళ్లి మళ్లీ ప్రజల విశ్వాసం చూరగొనే దిశగా ప్రయత్నాలు జరిగే అవకాశం ఉంది.
ఎన్‌డీఏలో లుకలుకలు మొదలు!
బిహార్ ఎన్నికల్లో ఘోర ఓటమిపై.. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ మిత్రపక్షాల మధ్య.. ఫలితాలు వెల్లడైన మర్నాడే లుకలుకలు మొదలయ్యాయి. రిజర్వేషన్లపై ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ వ్యాఖ్యలు, దాద్రీలో ముస్లిం హత్య, హరియాణాలో దళితుల హత్య వంటి ఘటనలు ఈ ఓటమికి కారణమని మిత్రపక్షాలతో పాటు బీజేపీ నేతలు సైతం నిరసన గళం విప్పారు. భాగవత్ వ్యాఖ్యల వల్ల బీసీలు, దళితులు ఆందోళనకు గురయ్యారని బీజేపీ ఎంపీ హుకుందేవ్ నారాయణ్‌యాదవ్ అన్నారు. సంఘ్ చెప్తున్నట్లు ప్రభుత్వం నడుచుకుంటుందని ప్రజలు నమ్మారని.. దానివల్లే బీజేపీ ఓడిపోయిందన్నారు. ఎన్డీఏ మిత్రపక్షమైన హిందుస్తానీ అవామీ మోర్చా (ఎస్) నేత, మాజీ సీఎం జితన్‌రామ్ మాంఝీ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. భగవత్ వ్యాఖ్యలు ఓబీసీలు, ఈబీసీల ఓట్లను లాలుప్రసాద్‌కు మద్దతుగా ఏకం చేశాయని మరోమిత్రపక్షమైన ఎల్‌జేపీ నేత అబ్దుల్‌ఖలీక్ పేర్కొన్నారు.