అర్చకుల కంటతడి ప్రభుత్వానికి మంచిది కాదు
హైదరాబాద్: ఇంట్లో భార్య, రైతు ఇంట్లో ఎద్దు ఏడిస్తే మంచిది కాదని, అర్చక వర్గం కంటతడి పెడుతూ రోడ్డెక్కితే రాష్ట్ర ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షులు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు. అర్చకులు, ఉద్యోగులకు 010 కింద ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించాలని కోరుతూ తెలంగాణ దేవాలయాల అర్చకులు, ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో తొమ్మిది రోజులుగా జరుగుతున్న సమ్మెలో భాగంగా అర్చకులు, ఉద్యోగులు హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద రెండో రోజు నిరాహారదీక్షలు చేశారు.
ఈ దీక్షా శిబిరానికి వచ్చిన పొంగులేటి వారికి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గుడికి వచ్చే రాజకీయ నాయకులు, వారి కుటుంబాలను బాగుండాలని దీవించే అర్చకులను రోడ్డుపై ఆందోళనలు చేసే విధంగా చేయడం దుర్మార్గమని ప్రభుత్వాన్ని విమర్శించారు. త్రిసభ్య కమిటీతో ఆగస్టు 1 లోపు సమస్యలను పరిష్కారం చేస్తానని చెప్పిన సీఎం ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదన్నారు.
తెలంగాణ యాసలో ప్రజలను మభ్య పెట్టినట్లే అర్చకుల విషయంలోనూ చేస్తే భగవంతుడే తగిన తీర్పు చెపుతారన్నారు. అర్చకులు, ఉద్యోగుల వేతనాలను 010 కింద ట్రెజరీల ద్వారా చెల్లించాలని, కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై వీలైనంత త్వరలో నిర్ణయం తీసుకుని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ వస్తే తమ బతుకులు బాగుపడతాయని విద్యార్థులు, యువకులు, రైతులు ఉద్యమించారని, ఉడతాభక్తిగా అర్చకులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని, ఢిల్లీలోనూ తమ గొంతు వినిపించారని గుర్తు చేశారు.
అర్చకులు, ఉద్యోగుల డిమాండ్లు తీర్చడం ప్రభుత్వానికి ఆర్థికంగా పెద్ద ఇబ్బంది కాదని, దేవాలయాలు, చర్చీలు, మసీదులకు వందల కోట్ల రూపాయలను ప్రకటిస్తున్నారని, దేవాలయాలు అభివృద్ది చెందితే అందులో పనిచేసే అర్చకులు, ఉద్యోగుల జీవితాలు బాగుపడాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. అర్చకులు, ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధనకు జరిగే ఆందోళనకు తమ పార్టీ అన్ని వేళలా అండగా ఉంటుందన్నారు. బీజేపీ శాసనసభా పక్షనేత కె.లక్ష్మణ్ మాట్లాడుతూ అర్చకులు, ఉద్యోగులు తొమ్మిది రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయమన్నారు.
ఈ నెల 3వ వారంలో జరిగే శాసనసభ సమావేశాల్లో అర్చకులు, ఉద్యోగుల సమస్యలపై చర్చించి ప్రభుత్వంపైఒత్తిడి తెస్తామన్నారు. బీజేపీ ఎమ్మెల్యే ఎన్‌వీవీఎస్ ప్రభాకర్, వైఎస్సార్ సీపీ ప్రధానకార్యదర్శి శివకుమార్, పార్టీ నాయకులు కొండా రాఘవరెడ్డి, మహేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, నల్లా సూర్యప్రకాశ్‌రావు, లోక్‌సత్తా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పాండురంగారావు, కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కుసుం కుమార్, సీపీఐ నాయకుడు సుధాకర్, తెలంగాణ దేవాలయాల అర్చకుల, ఉద్యోగుల జేఏసీ కన్వీనర్ గంగు భానుమూర్తి, ప్రధానకార్యదర్శి రంగారెడ్డి పాల్గొని మాట్లాడారు.