
వ్యతిరేక మీడియాకు కత్తెర!
ఫైబర్ గ్రిడ్ పథకం వెనుక రాజకీయ వ్యూహం
⇒ టీడీపీ నేతల కేబుల్ సంస్థలకు ఏజెన్సీలను కట్టబెడుతున్న ప్రభుత్వం
⇒ ఇతర కేబుల్ ఆపరేటర్ల వైర్లను తొలగించాలని ఆదేశాలు
⇒ పోలీసుల సహకారం కూడా తీసుకోవాలంటూ సూచన
⇒ వ్యతిరేకంగా వార్తలను ప్రసారం చేసే చానళ్ల నిలిపివేత
⇒ తద్వారా మీడియాను గుప్పిట్లో పెట్టుకోవాలనే ఎత్తుగడ
సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫైబర్ గ్రిడ్ పథకం వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే ఉన్నట్లు తెలుస్తోంది. తమకు వ్యతిరేకంగా వార్తలను ప్రసారం చేసే చానళ్లను నిలిపివేయాలన్నదే ప్రభుత్వ పెద్దల యోచనగా కనిపిస్తోంది. అందుకే రాష్ట్రంలో ఫైబర్ గ్రిడ్ ఏజెన్సీలను అధికార పార్టీ నేతలకు చెందిన కేబుల్ సంస్థలకే కట్టబెడుతున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా ఇతరుల కేబుల్ సంస్థల రెక్కలను ప్రభుత్వం విరిచేస్తోంది. టీడీపీ నాయకుల సంస్థల వైర్లను తప్ప ఇతర సంస్థల వైర్లను నిర్దాక్షిణ్యంగా తొలగించనుంది. అంటే అవి ఉనికిలో కూడా లేకుండా పోతాయి. అప్పుడు పెత్తనమంతా ఫైబర్ గ్రిడ్ ఏజెన్సీని దక్కించుకున్న టీడీపీ నేతల ప్రైవేట్ కేబుల్ సంస్థలదే.
ప్రభుత్వానికి నచ్చని చానళ్లను అవి నిలిపివేసే అవకాశం ఉంది. వాస్తవానికి మీడియాపై ప్రభుత్వాధినేత అసహనం రోజురోజుకూ పెరిగిపోతోంది. కాపు ఉద్యమం సమయంలో వార్తలను ప్రసారం చేయకుండా కొన్ని చానళ్లను ప్రభుత్వం నిలిపివేసింది. ఇటీవల మహిళా పార్లమెంట్ సదస్సు సందర్భంగా జాతీయ మీడియా అమ్ముడుపోయిందంటూ ప్రభుత్వాధినేత ఆక్రోశం వెళ్లగక్కారు. ఈ నేపథ్యంలో ఏకంగా మొత్తం మీడియాను గుప్పిట్లో పెట్టుకునేందుకు వీలుగా ఫైబర్ గ్రిడ్ పథకాన్ని ఉపయోగించుకోవాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించినట్టు సమాచారం. దీనిద్వారా వ్యతిరేక మీడియా ప్రసారాలు ప్రజలకు చేరకుండా అడ్డుచక్రం వేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
కేబుల్ ఆపరేటర్ల వైర్ల ద్వారానే సేవలు
ఫైబర్ గ్రిడ్ పథకం ప్రభుత్వ పెద్దలకు లబ్ధి చేకూర్చడంతోపాటు అధికార పార్టీ నేతలకు కాసులు కురిపించే కామధేనువుగా మారనుంది. ఫైబర్ గ్రిడ్ సేవలను అందించే బాధ్యతను ప్రభుత్వం టీడీపీ నేతలకు చెందిన కేబుల్ సంస్థలకే ప్రభుత్వం ఏజెన్సీల పేరిట కట్టబెడుతోంది. కర్నూలు జిల్లా కేంద్రంలో ఉపముఖ్యమంత్రి బంధువుల సంస్థకు అప్పగించారు. నంద్యాలలో వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి చెందిన కేబుల్ సంస్థకు ఏజెన్సీ దక్కింది. రూ.149కే టీవీ, ఇంటర్నెట్, ఫోన్ సౌకర్యం కల్పిస్తామంటూ ఏపీ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్‌ఎఫ్‌ఎల్) ద్వారా ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఏజెన్సీని దక్కించుకున్న ప్రైవేట్ కేబుల్ సంస్థలు తమ కేబుల్ వైర్ల ద్వారానే వినియోగదారులకు ఈ సేవలను అందించాల్సి ఉంటుంది. ఆ మేరకు ప్రభుత్వం ఆయా ప్రైవేట్ సంస్థలకు రుసుములు చెల్లిస్తుంది.
ముఖ్యమంత్రి ఆదేశాలు
విద్యుత్ స్తంభాలపై ఫైబర్ గ్రిడ్ కేబుల్ వైరు తప్ప ఇతర వైర్లు వేలాడకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంటే ఏజెన్సీని దక్కించుకున్న టీడీపీ నేతల కేబుల్ వైర్లు మాత్రమే ఉంటాయి. ఇతరుల కేబుల్ సంస్థల వైర్లను కత్తిరించేస్తారు. అంతిమంగా ఆ సంస్థలు మూతపడక తప్పదు. ఈ మేరకు విద్యుత్ పంపిణీ సంస్థలు(డిస్కంలు) కిందిస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాయి. వైర్లను తొలగించేందుకు అవసరమైతే పోలీసు సిబ్బంది సహాయం కూడా తీసుకోవాలంటూ గతేడాది డిసెంబర్ 24న ఎస్‌పీడీసీఎల్ అధికారులు మెమో(2175/16) జారీ చేశారు. పోలీసుల సహాయం తీసుకొని మరీ తొలగించాలం టూ స్వయంగా సీఎం గతేడాది నవంబర్ 16న జరిగిన సమా వేశంలో ఆదేశాలిచ్చా రని ఈ మెమోలో స్పష్టం చేశారు. ఇకపై ఫైబర్ గ్రిడ్ మాటున అధికార పార్టీ నేతలకు చెందిన కేబుల్ వైర్లు మాత్రమే విద్యుత్ స్తంభాలపై వేలాడనున్నాయి. ఫైబర్ గ్రిడ్ పథకం అమల్లోకి రాగానే జనం తమకు నచ్చిన చానల్ చూసే అవకాశం కూడా ఉండదు. టీడీపీకి చెందిన ప్రైవేట్ కేబుల్ ఆపరేటర్లు ప్రసారం చేసే చానళ్లనే చూడాల్సి ఉంటుంది.
సెట్ టాప్ బాక్స్ పేరుతో అదనపు భారం
కేవలం రూ.149కే ఇంటర్నెట్ అని చెబుతున్న ప్రభుత్వం.. సెట్‌టాప్ బాక్స్ పేరుతో వినియోగదారులపై అదనపు భారం మోపుతోంది. కేవలం సెట్‌టాప్ బాక్స్ కోసం రూ.4,000 చెల్లించాలని చెబుతోంది. ఇప్పటికే ఉన్న సెట్‌టాప్ బాక్స్‌లపై కొత్త సర్వీసుకు అవకాశం లేదంటున్నారు. దీంతో ఇప్పటికే రూ.2,000 నుంచి రూ.2,500 వెచ్చించి కొనుగోలు చేసిన సెట్‌టాప్ బాక్సులు నిరుపయోగంగా మారనున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. వినియోగదా రులు నెలవారీ రూ.149ల బిల్లుతోపాటు అదనంగా పన్నులు కూడా చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ఈ విషయాన్ని మాత్రం ప్రభుత్వం ఎక్కడా బయటపెట్టడం లేదు.
ఏజెన్సీలు అధికార పార్టీ నేతలకే..
► వాస్తవానికి ఏపీ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రభుత్వరంగ సంస్థ. రాష్ట్రవ్యాప్తంగా ఫైబర్ గ్రిడ్ సేవలను అందించే ఏజెన్సీలను అధికార పార్టీ నేతలకే కట్టబెడుతున్నారు.
► శ్రీకాకుళం జిల్లాలో జల్లేపల్లి గిరిధర్, జల్లేపల్లి శ్రీధర్‌లకు అప్పగించారు. వీరిద్దరూ అధికార పార్టీకి అత్యంత సన్నిహితంగా మెలుగుతున్నవారే.
► తూర్పు గోదావరి జిల్లా కాకినాడ, రాజమండ్రిలో కొండల్‌రావుకు చెందిన వెంకటసాయి కేబుల్ సంస్థకు అప్పగించారు. కొండల్‌రావు సతీమణి ప్రస్తుతం అధికారపార్టీ తరపున మేయర్‌గా కొనసాగుతున్నారు.
► వైఎస్సార్ జిల్లా కడపలో టీడీపీ నేత పుత్తా నరసింహారెడ్డికి చెందిన జ్యోతి కేబుల్‌కు అప్పగించారు.
► అనంతపురం జిల్లా కేంద్రంతోపాటు రా ప్తాడు, పెనుగొండ నియోజకవర్గాల్లో మంత్రి పరిటాల సునీత తనయుడు ప రిటాల శ్రీరాంకు చెందిన సిటీ కేబుల్‌కు ఫైబర్‌గ్రిడ్ ఏజెన్సీని కట్టబెట్టారు.
► రాష్ట్రంలో కొన్నిచోట్ల మాత్రం మొదటి నుంచీ ఉన్న కేబుల్ సంస్థలకు కూడా పనులు అప్పగించారు.