ఈ ఏడాది దూకుడు లేనట్లే
ఈ ఏడాది దూకుడు లేనట్లే
Published Sun, Aug 11 2013 1:41 AM | Last Updated on Fri, Sep 1 2017 9:46 PM
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు దృష్ట్యా ఈ ఏడాది వ్యాపారంలో దూకుడుగా వెళ్లరాదని ప్రభుత్వరంగ సిండికేట్ బ్యాంక్ నిర్ణయించుకుంది. ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న స్పష్టమైన సంకేతాలు వెలువడటం లేదని, వృద్ధిరేటు తిరిగి గాడిలో పడేదాకా వ్యాపారంలో ఆచితూచి అడుగులు వేయాలని నిర్ణయించుకున్నట్లు సిండికేట్ బ్యాంక్ సీఎండీ సుధీర్ కుమార్ జైన్ తెలిపారు. శనివారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వ్యాపారంలో 14 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నట్లు తెలిపారు.
గడిచిన ఆర్థిక సంవత్సరంలో తమ బ్యాంక్ వ్యాపార పరిమాణం రూ.3.34 లక్షల కోట్లుగా కాగా అది ఈ సంవత్సరం రూ.3.8 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. వ్యాపార విస్తరణలో భాగంగా ఈ ఏడాది దేశవ్యాప్తంగా 200 కొత్త శాఖలతోపాటు సుమారుగా 1,500 ఏటిఎంలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ప్రస్తుతం సిండికేట్ బ్యాంక్‌కి 3,004 శాఖలు, 1,350 ఏటిఎంలు ఉన్నాయి. అలాగే ఈ ఏడాది 1,500 మంది ఆఫీసర్లను, 1,400 మంది క్లరికల్ సిబ్బందిని నియమించుకుంటున్నట్లు తెలిపారు.
ఆర్‌బీఐ చర్యల వల్ల లిక్విడిటీపై స్వల్పంగా ఒత్తిడి ఉన్నప్పటికీ వడ్డీరేట్లను పెంచే ఆలోచన లేదన్నారు. ఈ సంవత్సరం రూ.1,830 కోట్ల మూలధనం సమకూర్చవలసిందిగా ప్రభుత్వాన్ని కోరినట్లు జైన్ చెప్పారు. రాష్ట్ర విభజన వల్ల రెండు రాష్ట్రాల వ్యాపారాల్లో పెద్దగా మార్పులొస్తొయని భావించడం లేదన్నారు. కాని ఈ వివాదాలు సద్దుమణిగితే మాత్రం ఆగిపోయిన పెట్టుబడులు హైదరాబాద్‌కు పెద్ద ఎత్తున రావచ్చన్నారు.
Advertisement
Advertisement