‘కమలం ఇక్కడ కాలు మోపడం కష్టమే’
► జనంలోకి కెప్టెన్
►డీఎండీకే వర్గాల్లో ఆనందం
►కమలం పాదం మోపడం కష్టమేనని వ్యాఖ్య
►ఒక ఓటు.. ముగ్గురు సీఎంలు
చెన్నై: రెండు నెలల అనంతరం డీఎండీకే అధినేత విజయకాంత్ జనంలోకి వచ్చారు. ఆయన రాకతో డీఎండీకే వర్గాల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. శనివారం విజయకాంత్ శివగంగైలో పర్యటించారు. తనదైన శైలిలో మీడియాతో మాట్లాడుతూ ఒక ఓటుతో ముగ్గురు సీఎంలను పదవిలో కూర్చోబెట్టిన ఘనత తమిళ ప్రజలకే దక్కిందని ఛలోక్తులు విసిరారు. డీఎండీకే అధినేత విజయకాంత్ కొంత కాలంగా తరచూ అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొంటూ వస్తున్న విషయం తెలిసిందే. సింగపూర్‌లో సైతం ఆయనకు కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స జరిగినట్టు వార్తలు వచ్చాయి. మార్చి నెల ఆయన ఆస్పత్రిలో చేరిన సమాచారం డీఎండీకే వర్గాల్లో ఆందోళన రేకెత్తించింది.
పోరూర్ సమీపంలోని ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారనే సమాచారంతో పార్టీ వర్గాలు పరుగులు తీశాయి. ప్రతి ఏడాది ఆయన వైద్య పరీక్షలు, చికిత్సల్లో బాగమేనని ఆ పార్టీ కార్యాలయం వివరణ ఇచ్చింది. అంతేకాకుండా కెప్టెన్‌ను సింగపూర్‌కు తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్న సమాచారం కార్యకర్తలను మరింత ఆందోళనలో పడేసింది. ఒక్కసారి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కావడం, మరీ వేంటనే ఆసుపత్రిలో చేరడం వంటి పరిణామాలనతో విజయ్‌కాంత్ కిడ్నీ మార్పు శస్త్రచికిత్స అనివార్యం అవుతున్నట్టుగా ప్రచారం ఊపందుకుంది. గత నెలలో డిశ్చార్జ్ అయి ఇంటికే పరిమితం కావడంతో తమ నాయకుడు జనంలోకి ఎప్పుడెప్పుడు వస్తారా అని పార్టీ శ్రేణులు ఎదురుచూశారు.
అదే సమయంలో రకరకాల ప్రచారాలు, పుకార్లు, షికారలు చేశాయి. అయితే విజయ్‌కాంత్ పేరు మీద తరచూ డీఎండీకే కార్యాలయం ప్రజా సమస్యల మీద, ప్రభుత్వ వైఫల్యాల మీద తరచూ ప్రకటల్ని విడుదల చేస్తూ వచ్చాయి. ఈ పరిస్థితులో శనివారం కెప్టెన్ ప్రజలోలకి రావడం డీఎండీకే వర్గాలకు ఆనందమేనని చెప్పాలి. జనంలోకి విజయకాంత్- ఆరోగ్యవంతుడిగా తాను ఉన్నానని చాటుకునే విధంగా శనివారం విజయకాంత్ హఠాత్తుగా శివగంగైలో పర్యటించారు. సతీమణి ప్రేమలతతో కలిసి కేడర్ ముందుకు వచ్చారు. తనదైన శైలిలో స్పందిస్తూ పర్యటనలో ముందుకు సాగారు. ఈసందర్భంగా మీడియా ప్రశ్నలకు తనదైన హావాభావాలు, డైలాగులతో స్పందించారు.
అన్నాడీఎంకే ముక్కలు కావడం, ఆ పార్టీ గొడవల గురించి తనకు తెలియదంటూ సమాధానాలు దాట వేశారు. అయితే తమిళనాడు ప్రజలు ఎంతో ఘనతను సాధించారని చమత్కరించారు. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక ఓటు వేసి ముగ్గురు సీఎంలను ఆ పదవిలో కూర్చో బెట్టారని ఎద్దేవా చేశారు. సీఎం జయలలిత అనారోగ్యంతో మరణించడం, పన్నీరు సీఎంగా దించడం, ఇప్పుడు పళని ఉన్నారని, తదుపరి ఎవరో అంటూ వ్యంగ్యాస్త్రం సంధించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిన మాట వాస్తవమేనని అంగీకరించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మకై ముందుకు సాగుతున్నాయా..? వారి మధ్య ఒప్పందాలు కుదిరాయా..? అన్న విషయాలు తనకు తెలియనే తెలియదంటూ మరోమారు తనదైన శైలిలో స్పందించారు. తానొస్తున్నానన్న విషయం తెలుసుకుని, ఇక్కడ రాజకీయంగా అనేక ఎత్తుగడలు వేసి ఉన్నారని ధ్వజమెత్తారు. అనేక పథకాలను తుంగలో తొక్కేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా, వ్యూహాలు రచించినా, తమిళనాడులో పాదం మోపడం మాత్రం కష్టమేనని పేర్కొన్నారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉందని, పొత్తు ఎవరితో అన్నది ఇక అప్పుడే అంటూ ముందుకు సాగారు.