టెన్త్‌లోనే స్టార్టప్
- 3 కోట్ల నిధులు సాధించిన చిచ్చరపిడుగులు
పదోతరగతి విద్యార్థులంటే.. పాఠాలకు ప్రాధాన్యం ఇస్తారు. మార్కులపై దృష్టి పెడతారు. ర్యాంకులు సాధించాలని తపిస్తారు. ఇవన్నీ ఒకప్పుడు. ఇప్పుడు కాలం మారింది. చదివే చదువుతో, ఎదిగే వయసుతో సంబంధం లేకుండా కుర్రాళ్లు దూసుకుపోతున్నారు. మైనార్టీ కూడా తీరని ముగ్గురు విద్యార్థులు.. స్టార్టప్ ఫండ్ కింద ఇప్పటికే రూ.3 కోట్లను ఆకర్షించారు. వివరాల్లోకెళ్తే....
‘మార్కెట్‌లో దొరికే శీతల పానీయాలు ఎంతవరకు సేఫ్? కూల్ డ్రింక్స్‌లో హానికారక క్రిమిసంహారాలున్నట్లు ఇప్పటికే రుజువు కాలేదా? అయినా జనాలు వాటినే తాగేస్తూ ఆరోగ్యం పాడుచేసుకుంటున్నారెందుకు? ఎందుకంటే... సురక్షితమైన శీతల పానీయాలు మార్కెట్‌లో అందుబాటులో లేకే ఈ పరిస్థితి. మంచి ఫ్లేవర్‌తో సురక్షితమైన కూల్‌డ్రింక్ దొరికితే జనాలు ఎందుకు తాగరు? అలాంటిదేదైనా తయారు చేయడం గురించి ఆలోచిస్తే ఎలా ఉంటుంది? తాగే నీటికే కమ్మని ఫ్లేవర్ ఇస్తే ఎలా ఉంటుంది..?’ అని ఆలోచించిన ముగ్గురు విద్యార్థుల జీవితాలు ఇప్పుడు ఒక్కసారిగా మారిపోయాయి.
మొదట్లో తిరస్కరణ..
జైపూర్‌లోని నీరజ మోదీ స్కూల్‌లో పదో తరగతి చదువుతున్న చైతన్య, మృగాంక్, ఉత్సవ్‌లు ..తాగునీటికి మంచి ఫ్లేవర్ ఇచ్చి, సురక్షితమైన శీతల పానీయాన్ని తయారు చేయాలనే ఆలోచన చేశారు. అనుకున్న విధంగా ఫ్లేవర్డ్ వాటర్‌ను రూపొందిం చి.. ‘ఎంటర్‌ప్రిన్యూర్‌షిప్ ఫెస్ట్’లో ప్రదర్శించారు. అయితే మొదటి రౌండ్‌లోనే వీరి కాన్సెప్ట్‌ను తిరస్కరించారు. దీంతో నిరాశగా వెనుదిరిగిన ఈ ముగ్గురికి.. ఫెస్టివల్ నిర్వాహకులకే నీటిని సరఫరా చేసే ఆర్డర్ దక్కింది. దీంతో తాము రూపొందిం చిన ఫ్లేవర్డ్ వాటర్‌నే సరఫరా చేశారు. దీంతో వారి దశ మారిపోయింది. అందులో పాల్గొన్న బడా వ్యాపారవేత్తలంతా కాన్సెప్ట్ గురించి తెలుసుకునేందుకు ఆసక్తి కనబర్చారు.
ఇప్పుడెలా....?
ఆలోచన బాగుందంటున్నారు... మరి వీటిని తయారు చేయాంటే ముందు లైసెన్స్ తీసుకోవాలి. ఇదంతా పెద్ద తతంగం. మనమంతా మైనర్లమే. మన వయసుకు లైసెన్స్ కూడా ఇవ్వరు. మరేం చేయాలి? ...అని ఆలోచిస్తున్న ఈ ముగ్గురికి స్టార్టప్ ఐడియా వచ్చింది. ముందుగా ఓ స్టార్టప్‌ను ఏర్పాటు చేసి, ఐడియాను పారిశ్రామికవేత్తల వద్దకు తీసుకెళ్లగలిగితే.. ఆ తర్వాత ఎటువంటి ఇబ్బంది ఉండదనుకున్నారు. ఐఐటీ కాన్పూర్, ఐఐఎం ఇండోర్‌లో కాంపిటీషన్లలో కాన్సెప్ట్‌ను ప్రదర్శించా రు. దీంతో మాలవీయ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీముందుకొచ్చింది. వెంటనే స్టార్టప్‌ను ప్రారంభించాలని, అవసరమైన రూ.3 కోట్లను తాము సమకూరుస్తామని ప్రకటించింది. పేటెంట్ హక్కుల కోసం కూడా సాయం చేస్తామని హామీ ఇచ్చింది.