
ఉమ్మడి రాజధానికి పదేళ్లు అవసరం లేదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన అనంతరం హైదరాబాద్‌ను పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాల్సిన అవసరం లేదని తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు కేంద్ర మంత్రివర్గ ఉపసంఘం(జీవోఎం)ను కోరారు. మూడు నుంచి ఐదేళ్లు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచితే చాలని, ఈ లోపు సీమాంధ్రకు కొత్త రాజధానిని ఏర్పాటు చేయాలని సూచించారు. కేంద్రం ప్రకటించిన విధంగా 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం మాత్రమే కావాలని, ప్రత్యేకించి సరిహద్దులు మార్చాల్సిన అవసరమే లేదని పేర్కొన్నారు. 371(డి) అధికరణను సవరించడానికి రెండింట మూడొంతుల మెజారిటీ అవసరం లేదని, విభజన బిల్లు మాదిరిగానే సాధారణ మెజారిటీతోనే దీనిని సవరించవచ్చని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా శాసనమండలిని కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. మండలి రద్దవుతుందంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బిల్లులో ఈ అంశాన్ని తప్పనిసరిగా పొందుపర్చాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం సీఎల్పీ కార్యాలయంలో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీలు కె.ఆర్.ఆమోస్, కె.యాదవరెడ్డి, రాజలింగంగౌడ్, వి.భూపాల్‌రెడ్డి, టి.భానుప్రసాద్‌రావు, ఎస్.సంతోష్‌కుమార్, ఎమ్మెస్ ప్రభాకర్, ఫారూఖ్ హుస్సేన్ సీనియర్ నేతలు పి.నర్సారెడ్డి, ఎస్.ఇంద్రసేనారెడ్డి, బి.మోహన్‌రెడ్డి, వెంకట్రామిరెడ్డి సమావేశమై కేంద్ర మంత్రివర్గ ఉపసంఘానికి సమర్పించాల్సిన అంశాలపై చర్చించి నివేదిక రూపొందించారు. అనంతరం ఆ నివేదికను యాదవరెడ్డి మీడియాకు విడుదల చేశారు.
నివేదికలో ముఖ్యాంశాలు: 10 జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సరిహద్దులను మర్చాల్సిన అవసరం లేదు. హైదరాబాద్‌ను పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాల్సిన పని లేదు. హైదరాబాద్‌కు సీమాంధ్ర జిల్లాలు 200 కి.మీల నుంచి 900 కి.మీల దూరంలో ఉండటంతో ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి. మూడు నుంచి ఐదేళ్లు మాత్రమే హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలి. తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్రాల ప్రయోజనాల మేరకు వెంటనే సీమాంధ్రకు కొత్త రాజధానిని ఏర్పాటు చేయాలి. ప్రణాళికా సంఘంలోని సభ్యులతో ప్రత్యేక కమిటీని నియమించి తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్రాల్లోని వెనుకబడిన ప్రాంతాలను గుర్తించి వాటి అభివృద్ధికి తగిన సాయం చేయాలి. హైదరాబాద్‌లో సీమాంధ్రులకు రక్షణ కల్పించే విషయంలో తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డీజీపీలతోపాటు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులతో ఓ కమిటీని ఏర్పాటు చేయాలి. బచావత్ ట్రిబ్యునల్ మేరకు నీటి వనరులను పంపిణీ చేయాలి.