వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం గుంటూరు జిల్లా నరసరావు పేటకు వెళుతున్నారు.
నేడు నరసరావు పేటకు వైఎస్ జగన్
గుంటూరు: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో మాజీ సీఎం కాసు బ్రహ్మనందరెడ్డి మనవడు కాసు మహేష్ రెడ్డి ఆయన అనుచరులతో కలిసి వైఎస్‌ఆర్ సీపీలో చేరుతారు. అనంతరం నరసరావు పేట రెడ్డి కాలేజీ గ్రౌండ్‌లో సా.4గంటలకు జరిగే భారీ బహిరంగ సభలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
సభా సమరానికి రంగం సిద్ధం
హైదరాబాద్: నేటి నుంచి తెలంగాణ శాసనసభ, శాసనమండలి శీతాకాల సమావేశాలు చలికాలంలోనూ వేడి పుట్టించనున్నాయి. శుక్రవారం ఉదయం 10 గంటలకు శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 30వ తేదీ వరకు సమావేశాలు నిర్వహించాలని గురువారం జరిగిన బీఏసీ భేటీలో నిర్ణయించారు. సెలవు రోజులు పోగా 12 రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. అవసరమైతే మరిన్ని రోజులు పొడిగించేందుకు సిద్ధమని ప్రభుత్వం వెల్లడించింది. ఈ సమావేశాల్లో ప్రధానంగా 20 దాకా అంశాలు చర్చకు రావచ్చని అంచనా వేస్తున్నారు.
కరుణానిధికి మరోసారి అస్వస్థత
చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే పార్టీ అధ్యక్షుడు కరుణానిధి మరోసారి అస్వస్థతకు గురయ్యారు. గురువారం రాత్రి అనారోగ్యానికి గురైన ఆయన్ను కుటుంబసభ్యులు కావేరి ఆసుపత్రికి తీసుకువెళ్లారు. గొంతు, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా శ్వాస తీసుకోవడానికి ఆయన ఇబ్బంది పడుతున్నారని ఆస్పత్రి విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందిస్తున్నామని పేర్కొంది.
నేటితో ముగియనున్న పార్లమెంటు సమావేశాలు
పార్లమెంటు శీతాకాల సమావేశాలకు ఒకరోజు మాత్రమే మిగిలుంది. నవంబర్ 16న సమావేశాల ప్రారంభం నుంచి ఒక్కరోజు కూడా సభ సజావుగా జరగలేదు. ఉభయ సభల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం, పట్టువిడుపులు విడవకపోవటం తో ఈసారి సమావేశాలు ఎలాంటి చర్చ లేకుండానే నిరవధిక వాయిదా పడేట్లు కనబడుతున్నాయి.
నేడు ప్రధాని వద్దకు రాహుల్ బృందం
ఉత్తరప్రదేశ్‌లో తాను చేపట్టిన ‘కిసాన్ యాత్ర’ సందర్భంగా రైతులు చేసిన డిమాండ్లను తెలియజేసేందుకు రాహుల్ గాంధీ నేతృత్వంలోని విపక్ష పార్టీల బృందం శుక్రవారం ఉదయం ప్రధానిని కలవనుంది. ఆ తర్వాత ఈ బృందం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలసి నోట్లరద్దు సమస్యలపై ఫిర్యాదు చేయనుంది.
నేడు ఆలస్యంగా 'సికింద్రాబాద్-గోరఖ్‌పూర్'
సికింద్రాబాద్- గోరఖ్‌పూర్ ఎక్స్‌ప్రెస్(12590) రైలు శుక్రవారం ఆలస్యంగా బయలు దేరనుంది. ఉదయం 7.20 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరాల్సి ఉండగా..4 గంటలు ఆలస్యంగా ఉదయం 11.20కి బయలుదేరనుంది.
ఇవాళ బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ
ఢిల్లీ: ఇవాళ బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీ కానుంది. ఎంపీలనుద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.
నేడు ఆర్టీసీ సీసీఎస్ ఎన్నికలు
ఆర్‌టీసీలో సీసీఎస్ (క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ) డెలిగేట్స్ స్థానాలకు శుక్రవారం ఎన్నికలు జరగనున్నాయి. 126 డిపోలు, 5 వర్క్ షాపుల్లో 56,500 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 236 డెలిగేట్ పోస్టులకు 700 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.
స్పెయిన్‌పై గెలుపుతో సెమీస్‌లోకి దూసుకెళ్లిన భారత్
లక్నో: టైటిల్ ఫేవరెట్ హోదాకు తగ్గట్టు ఆడిన భారత జట్టు జూనియర్ హాకీ ప్రపంచకప్‌లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ 2–1తో స్పెయిన్‌పై గెలిచింది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో భారత్... ఆస్ట్రేలియాతో అమీతుమీ తేల్చుకుంటుంది.
నేటి నుంచి చెన్నైలో చివరి టెస్టు
చెన్నై: ‘వర్దా’ తుపాను తర్వాత నెలకొన్న ప్రశాంతత మధ్య భారత్, ఇంగ్లండ్ సిరీస్‌లో ఐదో టెస్టుకు చెపాక్‌లో రంగం సిద్ధమైంది. ఎన్నో ప్రతికూలతల మధ్య మ్యాచ్ నిర్వహణ కోసం చిదంబరం స్టేడియం సిబ్బంది తీవ్రంగా శ్రమించడంతో అనుకున్న ప్రకారం నేటి (శుక్రవారం) నుంచి చివరి టెస్టు జరగనుంది. ఇప్పటికే 3–0తో సిరీస్ నెగ్గి తిరుగులేని ఆధిక్యం కనబరిచిన భారత్ దీనిని మరింత పెంచుకోవాలని భావిస్తోంది. భారత్‌లో అడుగు పెట్టిన నాటినుంచి విజయానికి ఆమడ దూరంలో నిలిచిన ఇంగ్లండ్ ఒత్తిడి లేకుండా ఆడి కాస్త మెరుగ్గా సిరీస్ ముగించాలని ఆశిస్తోంది.