మెమన్ 'క్షమాభిక్ష': విచారణ రేపటికి వాయిదా
ముంబై: 1993 ముంబై పేలుళ్ల కేసులో దోషి యాకూబ్ మెమన్ కు ఉరిశిక్ష అమలుపై ఉత్కంఠ కొనసాగుతూనేఉంది. ఉరిని రద్దుచేయాలని కోరుతూ మెమన్ దాఖలు చేసిన పిటిషన్ పై సోమవారం సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది. మొదట మహారాష్ట్ర ప్రభుత్వం తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు.
257 మందిని బలితీసుకున్న ముంబై పేలుళ్ల కేసులో యాకూబ్ మెమన్ పాత్ర సుస్పష్టమని, గతంలో ఇచ్చిన తీర్పును అనుసరించి ఈ నెల 30న అతడిని ఉరితీయాల్సిందేనని ముకుల్ రోహత్గీ వాదించారు. మెమన్ తరఫు వాదనలను మంగళవారం వింటానన్న కోర్టు.. విచారణను రేపటికి వాయిదావేసింది.
అయితే తుది తీర్పు ఎప్పుడు వెలువరించేది తెలియరాలేదు. మరోవైపు గత ఉత్తర్వుల ప్రకారం ఈ నెల 30న నాగపూర్ జైలులో యాకూబ్ మెమన్ ను ఉరితీసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు.