పాకిస్తాన్ రెండో ఆర్థిక రాజధాని లాహోర్ మరోసారి పేలుడుతో దద్దరిల్లింది.
లాహోర్: పాకిస్తాన్ రెండో ఆర్థిక రాజధాని లాహోర్ మరోసారి పేలుడుతో దద్దరిల్లింది. పండ్లతో నిండిన ట్రక్కులో అమర్చిన శక్తిమంతమైన బాంబు పేలడంతో 34 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక పండ్ల మార్కెట్ వద్ద సోమవారం రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. పేలుడు ధాటికి సమీపంలోని వాహనాలు, భవంతులు ధ్వంసమయ్యాయి.
క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామని లాహోర్ ప్రభుత్వ ఉన్నతాధికారి అబ్దుల్ ఖాన్ సుంబాల్ మీడియాకు తెలిపారు. బాంబు అమర్చిన వాహనం ఎవరిదో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు.
కొద్ది రోజుల కిందటే లాహోర్‌లోని ప్రఖ్యాత కూరగాయల మార్కెట్‌లో పాక్‌తాలిబన్లు జరిపిన పేలుళ్లలో 26 మంది చనిపోగా, పదుల మంది గాయపడిన సంగతి తెలిసిందే. తాజా ఘటనకు బాధ్యులు ఎవరనేది తెలియాల్సిఉంది.