
బాబు సమక్షంలో బయటపడ్డ టీటీడీపీ విభేదాలు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జరిగిన టీటీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో తెలుగు తమ్ముళ్ల విభేదాలు మరోసారి బయటపడ్డాయి. టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, తెలంగాణ శాసనసభలో టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకరరావులు పరోక్షంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు.
'పదవులు ఇచ్చింది అధికారం చెలాయించడానికి కాదు. నియోజకవర్గ ఇంఛార్జ్లను బలోపేతం చేయాలి. నేను ఫలానా పదవిలో ఉన్నాను. పెత్తనం చెలాయిస్తాను అనే మాటలొద్దు' అని ఎర్రబెల్లి విమర్శించారు. 'ఏ పదవిలో ఉన్నా పార్టీ కోసమే కష్టపడి పని చేశా. పార్టీలో కష్టపడిన వారికి పదవులు వాటంతట అవే వస్తాయి. 2007లో పార్టీలో చేరి అంచెలంచలుగా ఎదిగి వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాను' అని రేవంత్ రెడ్డి వివరించారు.