డిస్ట్రిబ్యూటర్లకు దిగ్భ్రాంతే మిగిలింది!!
సల్మాన్ ఖాన్ 'ట్యూబ్‌లైట్' బాక్సాఫీస్ వద్ద వెలుగలేదు. కనాకష్టంగా రూ. 100 కోట్ల మార్క్‌ను దాటిన ఈ సినిమాతో డిస్ట్రిబ్యూటర్లకు తీవ్ర దిగ్భ్రాంతే మిగిలింది. సల్మాన్ ఖాన్ కెరీర్‌లో 'వాంటెడ్' చిత్రం తర్వాత అతిపెద్ద అట్టర్ ప్లాప్ సినిమా 'ట్యూబ్‌లైటే'నని సినీ విశ్లేషకులు చెప్తున్నారు. గతంలో ఈద్ సందర్భంగా వచ్చిన సల్మాన్ సినిమాలు భారీ ఎత్తున బిజినెస్ చేశాయి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని డిస్ట్రిబ్యూటర్లు 'ట్యూబ్‌లైట్' సినిమా థియేట్రికల్ హక్కులను కళ్లుచెదిరే ధరకు కొనుగోలు చేశారు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా కూడా ఆడకపోవడం డిస్ట్రిబ్యూటర్లను తీవ్ర నష్టాలు మిగిల్చినట్టు తెలుస్తోంది.
బాక్సాఫీస్ లెక్కల ప్రకారం మొదటి తొమ్మిదిరోజుల్లో ట్యూబ్‌లైట్ 107.32 కోట్లు వసూలు చేసింది. కానీ ఈ సినిమా కనీసం రూ. 300-350 కోట్లు వసూలుచేస్తేనే డిస్ట్రిబ్యూటర్లు లాభం వచ్చే పరిస్థితి ఉందని సినీ విశ్లేషకుడు గిరీష్ జోహార్ తెలిపారు. సల్మాన్ ఈద్ రిలీజ్ కావడంతో ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు భారీ ధరకు కొనుగోలు చేశారని ఆయన చెప్పారు. ట్యూబ్‌లైట్ థియేట్రికల్ హక్కులు రూ. 132 కోట్లకు అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. అలాగే ఈ సినిమా శాటిలైట్, మ్యూజిక్ హక్కులు వరుసగా రూ. 55 కోట్లు, రూ. 38 కోట్లకు అమ్ముడుపోయినట్టు సమాచారం. అయితే, సినిమా బాక్సాఫీస్ వద్ద బాగా ఆడకపోవడంతో ఈ ధరలను సవరించే అవకాశం ఉందని చెప్తున్నారు. సినిమా బాక్సాఫీస్ లెక్కల ఆధారంగానే ఈ హక్కుల ఒప్పందాలు కుదురుతుండటంతో సినిమాలు ప్లాప్ అయితే.. ధర తగ్గించుకునే వెసులుబాటును ఆయా వర్గాలు కోరుతున్నట్టు చెప్తున్నారు. మొత్తానికి ట్యూబ్‌లైట్ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 125 కోట్లు వసూలు చేస్తే గొప్ప అని భావిస్తున్నారు.