రెండున్నర నిమిషాల్లో అణుయుద్ధం
రెండున్నర నిమిషాల్లో అణుయుద్ధం
Published Tue, Jan 31 2017 4:43 PM | Last Updated on Sat, Aug 25 2018 6:21 PM
ప్రపంచ అణుయుద్ధం సంభవించి ప్రపంచదేశాలు సర్వనాశనమయ్యే ‘డూమ్స్ డే’ మరెంతో దూరంలో లేదు. అణు యుద్ధం సంభవించే ఆ 12 గంటల కాలానికి ప్రపంచం కేవలం రెండున్నర నిమిషాల దూరంలో ఉందని అణు శాస్త్రవేత్తల బులెటిన్ ప్రకటించింది. ఆ మేరకు షికాగో యూనివర్సిటీలోని బులెటిన్ గోడపై వేలాడదీసిన ఊహాత్మక గడియారాన్ని సవరించామని వెల్లడించింది. అమెరికా కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అణ్వస్త్రాల గురించి ఇటీవల చేసిన వ్యాఖ్యలను, భూతాపోన్నతి పరిస్థితులను ఆయన తేలిగ్గా తీసుకోవడం తదితర అంశాలతోపాటు భారత్, పాకిస్థాన దేశాల సరిహద్దుల మధ్య ఉద్రిక్త పరిస్థితలు తలెత్తడం, ఇరు దేశాల ప్రభుత్వాల తాజా వైఖరి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని డూమ్స్ డే గడియారాన్ని సవరించామని బులెటిన్‌లో అణు శాస్త్రవేత్తలు వివరించారు.
హిరోషిమా, నాగసాకి నగరాల్లో అణు బాంబులు సృష్టించిన అపార నష్టాన్ని చూశాక ‘మన్‌హట్టన్ అణు ప్రాజెక్ట్ (ప్రపంచంలో తొలి అణ్వస్త్రాల తయారీ ప్రాజెక్ట్)’లో పాల్గొన్న అణు శాస్త్రవేత్తలు ఓ బృందంగా ఏర్పడి ప్రపంచంలో మరెక్కడా అణుబాంబులు పేలకుండా చూడాలని నిర్ణయించారు. వారి ఆలోచనలో భాగంగానే 1947లో ఊహాత్మక డూమ్స్ డే గడియారాన్ని సృష్టించారు. ప్రపంచ దేశాల మధ్య అణు యుద్ధం ఎంత సమీపానికి వచ్చిందో ప్రపంచ పరిణామాలను, పరిస్థితులను బేరీజు వేసి చెప్పడం ఈ గడియారం ఉద్దేశం. తద్వారా అణు యుద్ధ మేఘాల నిర్మూలనకు చర్యలు తీసుకోవచ్చన్నది వారి అభిప్రాయం. వారు గడియారాన్ని సవరించినప్పుడల్లా 15 మంది నోబెల్ అవార్డు గ్రహీతల అభిప్రాయం కూడా పరిగణనలోకి తీసుకుంటారు.
అణు శాస్త్రవేత్తలు 1947లో ఏర్పాటుచేసిన ఈ డూమ్స్ డే గడియారంలో అణుయుద్ధం జరిగే సమయాన్ని అర్ధరాత్రి 12 గంటలుగా పేర్కొన్నారు. ఇప్పుడు, అంటే 2017లో ఆ గడియారంలో అర్ధరాత్రి 11గంటల 57 నిమిషాల, 30 సెకండ్లు అయినట్లు సవరించారు. అంటే ప్రపంచం అణు యుద్ధానికి సరిగ్గా రెండున్నర నిమిషాల దూరంలో ఉందన్న మాట. 12 గంటలకు ఇంత దగ్గరగా రావడం 1953 తర్వాత ఇదే మొదటిసారి. అప్పుడు 12 గంటలకు రెండు నిమిషాల దూరంలో ఉన్నట్లు పేర్కొన్నారు. తొలి హైడ్రోజన్ బాంబు పరీక్ష జరిగిన కారణంగా అప్పుడు సమయాన్ని అలా పేర్కొన్నారు. గడియారాన్ని మొదట ఏర్పాటు చేసినప్పుడు 12 గంటలకు ఏడు నిమిషాల దూరంలో ఉన్నట్టు పేర్కొనగా, 1991లో 17 నిమిషాల దూరంలో ఉన్నట్లు సవరించారు. ఇప్పటి వరకు ఈ గడియారాన్ని 22 సార్లు సవరించారు.
ఆసియా దేశాల మధ్యనే, అంటే భారత్, పాకిస్థాన్ దేశాల మధ్యనే అణుయుద్ధం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అణుశాస్త్రవేత్తలు, నోబెల్ గ్రహీతలు అభిప్రాయపడ్డారు. భారత్ సైనిక స్థావరాలపై పాక్ మూకలు జరిపిన దాడులు, ప్రతీకారంగా భారత్, పాకిస్థాన్ భూభాగంలోకి చొచ్చుకుపోయి సర్జికల్ దాడులు జరపడాన్ని, ముందస్తుగా అణ్వస్త్రాలను ప్రయోగించమనే భారత సిద్ధాంతాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉందని భారత రక్షణ మంత్రి వ్యాఖ్యానించడం, అంతే ఘాటుగా పాకిస్థాన్ రక్షణ మంత్రి స్పందించడం లాంటి అంశాలను వారు ఉదహరించారు. బీజేపీ అధికారంలో ఉండడాన్ని కూడా వారు పరోక్షంగా పేర్కొన్నారు. ఈ రెండు దేశాల మధ్య అణు యుద్ధం జరిగితే ఆ యుద్ధంలో, ఆ తర్వాత సంభవించే వాతావరణ పరిణామాల వల్ల దాదాపు 200 కోట్ల మంది ప్రజలు మరణిస్తారని అమెరికా ఆటమిక్ సంస్థ గతంలో అంచనా వేసింది. తొలుత కేవలం అణు యుద్ధానికే పరిమితం చేసిన ఈ డూమ్స్ డే గడియారాన్ని 2007 నుంచి వాతావరణ పరిస్థితుల మార్పు వల్ల సంభవించే ప్రళయానికి కూడా అన్వయిస్తూ వస్తున్నారు. అందుకనే భూతాపోన్నతి అంశాన్ని డోనాల్డ్ ట్రంప్ సీరియస్‌గా తీసుకోకపోవడాన్ని కూడా వారు పరిగణనలోకి తీసుకున్నారు.
Advertisement
Advertisement