
నా మాటలను వక్రీకరించాయి: దాడి వీరభద్రరావు
ఎల్లోమీడియాకు చెందిన రెండు పత్రికలు తాను అనని మాటలను వక్రీకరించి ప్రచురించాయని, ఇది జర్నలిజం విలువలకు విరుద్ధమని వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యుడు దాడి వీరభద్రరావు అన్నారు.
ఎల్లోమీడియా వార్తలపై దాడి
సాక్షి, హైదరాబాద్: ఎల్లోమీడియాకు చెందిన రెండు పత్రికలు తాను అనని మాటలను వక్రీకరించి ప్రచురించాయని, ఇది జర్నలిజం విలువలకు విరుద్ధమని వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యుడు దాడి వీరభద్రరావు అన్నారు. సోమవారం నాటి విలేకరుల సమావేశంలో తాను అరగంటపైగా చంద్రబాబు, సీఎం కిరణ్ వైఖరిపై విమర్శలు చేస్తే.. వాటికసలు ప్రాధాన్యమే ఇవ్వకపోగా, జగన్‌ను సోనియా క్షమించలేదనే భావం వచ్చేటట్టుగా కావాలనే ఆ రెండు పత్రికలు ప్రచురించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయం వద్ద మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ను వీడి వైఎస్సార్ సీపీని పెట్టారనే కక్షతోనే సోనియా..జగన్‌పై కేసులు పెట్టి వేధించారనే భావాన్ని తాను వ్యక్తీకరిస్తే.. దానిని ఏకపక్షంగా సందర్భాన్ని పూర్తిగా విస్మరించి ప్రచురించాయని తప్పుపట్టారు. తద్వారా జగన్‌తోపాటు తమ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు. అసలు సోనియాను క్షమించమని ఎప్పుడూ కోరలేదని, అసలామెను క్షమించమని కోరే అవసరం తమకేముందని అన్నారు.