అతిపెద్ద సంక్షోభంలో ప్రపంచం!
ఐక్యరాజ్యసమితి: ప్రపంచం అతిపెద్ద మానవ సంక్షోభాన్ని ఎదుర్కోనుందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. యెమన్, దక్షిణ సూడాన్, సోమాలియా, నైజీరియా దేశాల్లోని రెండు కోట్ల మంది కరువు, ఆకలి దప్పికలతో అలమటించనున్నారని పేర్కొంది. దీనిపై అన్ని దేశాలు సమన్వయంతో పనిచేయకపోతే ప్రజలు ఆకలి బాధలతో పాటు వివిధ వ్యాధులతో మరణించే అవకాశముందని ఐరాస మానవతావాద సంఘం చీఫ్ స్టీఫెన్ ఒబ్రియన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆ నాలుగు దేశాలకు వెంటనే నిధులు పంపించాలని ఐరాస భద్రతా మండలిలో విజ్ఞప్తి చేశారు.
ఈ విపత్తు నివారణకు వచ్చే జూలై వరకు రూ.30 వేల కోట్లు అవసరమవుతాయని చెప్పారు. అక్కడి అభివృద్ధి పూర్తిగా మందగిస్తుందన్నారు. ఐదేళ్లలోపు వయసున్న 30 శాతం మంది చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడుతున్న విషయం ఐక్యరాజ్యసమితి అధ్యయనంలో వెల్లడైందని చెప్పారు. యెమన్‌లోని మొత్తం జనాభా 1.8 కోట్ల మందిలో 70 లక్షల మంది ఆకలితో అలమటిస్తున్నారన్నారు. అరబ్ దేశాల్లో పేద దేశమైన యెమన్ నుంచి గత రెండు నెలల్లో 48 వేల మంది వలసపోయారని తెలిపారు.
ఇటీవల తన పర్యటన సందర్భంగా అక్కడి నేతలను, రెబెల్స్‌ను కలిసి సాయమందిస్తామని హామీ ఇచ్చినట్లు ఒబ్రియాన్ చెప్పారు. మానవతా కోణంలో చేస్తామన్న సాయాన్ని వారు నిర్దాక్షిణ్యంగా తిరస్కరించారని తెలిపారు. అక్కడి నేతలు తమ ప్రవర్తన మార్చుకోకపోతే రాబోయే మానవ సంక్షోభానికి బాధ్యత వహించక తప్పదన్నారు. అలాగే మూడేళ్ల పౌర యుద్ధంతో ఆర్థికంగా చితికిపోయిన దక్షిణ సూడాన్‌లో కూడా పరిస్థితి దారుణంగా ఉందన్నారు. సూడాన్‌లో కరువును మనుషులే సృష్టించారని చెప్పారు.