రాష్ట్రంలోని విద్యాసంస్థలు మావోయిస్టు రిక్రూట్‌మెంట్ కేంద్రాలుగా మారాయా...?
వివిధ వర్సిటీల నుంచి వెళ్లినట్లు పోలీసుల అనుమానం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విద్యాసంస్థలు మావోయిస్టు రిక్రూట్‌మెంట్ కేంద్రాలుగా మారాయా...? ఔననే అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి నిఘా వర్గాలు. కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న దండకారణ్యంలో ఇటీవల మావోయిస్టుల కదలికలు పెరగడంతో పాటు ఇటీవ ల జరిగిన రెండు ఎన్‌కౌంటర్లలో మరణించినవారి వివరాలను పరిగణనలోకి తీసుకున్న అధికారులు ఈ అనుమానాలే వ్యక్తం చేస్తున్నారు. కొన్నాళ్ల క్రితం ఖమ్మం-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో ఉస్మానియా యూనివర్సిటీలో న్యాయ విభాగంలో రెండో సంవత్సరం చదివే వివేక్ మృతి చెందారు.
మంగళవారం నాటి వరంగల్ జిల్లా ఎన్‌కౌంటర్‌లో ఎంటె క్ విద్యనభ్యసిస్తున్న మహిత ప్రాణాలు కోల్పోయింది. ఇటీవలి కాలంలో వివిధ యూనివర్సిటీల్లో విద్యనభ్యసిస్తున్న వరంగల్, కరీంనగర్ జిల్లాలకు చెందిన 36 మంది అజ్ఞాతంలోకి వెళ్లినట్లు అనుమానిస్తున్న పోలీసులు దీనిపై లోతుగా ఆరా తీస్తున్నారు.
కఠినంగా వ్యవహరిస్తాం..
‘‘మావోయిస్టుల పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. రాష్ట్రంలో వారి ప్రభావం మరింత తగ్గేలా చేస్తాం. పక్క రాష్ట్రాల నుంచి మావోయిస్టులు వచ్చారనే సమాచారం మేరకే కూంబింగ్ చేపట్టాం. ఆ క్రమంలోనే వరంగల్ జిల్లాలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో మేం ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు. మృతుల్లో ఉన్నత విద్యను అభ్యసించేవారు ఉండటంపై లోతుగా విచారణ జరుపుతున్నాం. కొంతమంది మావోయిస్టులు తప్పించుకున్నారనే సమాచారం నేపథ్యంలో గాలింపులు జరుపుతున్నాం. మావోయిస్టులు కొత్తగా రిక్రూట్‌మెంట్ చేపట్టినట్లు మా దృష్టికి రాలేదు..’’ - అనురాగ్‌శర్మ, డీజీపీ