
మహిళ కంట్లో కారం, మైదాపిండి చల్లి..
మహిళ కంట్లో కారం, మైదాపిండి చల్లి ఇంట్లో బంగారం అపహరించుకుపోయిన ఘటన తణుకులో చోటు చేసుకుంది.
తణుకు : ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళ కంట్లో కారం, మైదాపిండి చల్లి ఇంట్లో బంగారం అపహరించుకుపోయిన ఘటన తణుకులో చోటు చేసుకుంది. సజ్జాపురంలోని స్వాతి అపార్ట్‌మెంటులో మాకిన శ్రీరామ్మూర్తి ఆయన భార్య మాకిన సత్యవతి భార్యభర్తలు నివాసం ఉంటున్నారు. రాత్రి శ్రీరామ్మూర్తి టిఫిన్ చేసి బయటకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లారు. తలుపు గడియ పెట్టుకుని ఆ మహిళ ఇంట్లో పడుకుంది. సుమారు రాత్రి 11 గంటల సమయంలో కాలింగ్ బెల్లు మోగడంతో తలుపు తీసింది.
గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు వచ్చి ఇదే అపార్టుమెంటులో తాము నివాసం ఉంటున్నామని, అయితే తమకు కరెంటు లేదని మీకు ఉందా అంటూ అడిగారు. తమకు కరెంటు ఉందని ఇంట్లో విద్యుత్ మీటర్ చూపించేందుకు లోపలకు రమ్మని చెప్పింది. ఇదే అదనుగా ఆమెపై దాడిచేసిన అగంతకులు ఆమె కళ్లల్లో కారం, మైదా పిండి చల్లడంతో అపస్మారక స్థితికి చేరుకుంది. అనంతరం బీరువాలో దాచుకున్న సుమారు 20 కాసుల బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. అయితే బాధితురాలు సత్యవతి పొంతన లేని సమాధానాలు చెబుతుండటంతో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.
కంట్లో కారం చల్లారని ఒకసారి... అపస్మారక స్థితికి వెళ్లానని మరోసారి ఇలా చెబుతోంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టణ రెండో ఎస్సై రుక్మంగధరావు కేసు నమోదు చేశారు. ఘటనా స్థలాన్ని కొవ్వూరు ఇన్‌చార్జి డీఎస్పీ నున్న మురళీకృష్ణ, తణుకు సీఐ సీహెచ్ రాంబాబు, పట్టణ ఇన్‌చార్జి ఎస్సై వి.జగదీశ్వరరావు పరీశీలించారు. ఏలూరు నుంచి వేలిముద్రల నిపుణులు, డాగ్‌స్క్వాడ్ రప్పించి ఆధారాలు సేకరించారు.